దుబాయ్‌లో గొల్లపల్లి వాసి అదృశ్యం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉన్న ఊర్లో ఉపాధి లేక బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు అక్కడ అదృశ్యమయ్యాడు. అక్కడి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన అందే శ్రీకాంత్ అనే యువకుడు ఈనెల 15న దుబాయ్‌కి వెళ్లాడు. దుబాయ్‌లోని షుగర్ కంపెనీలో పని చేయడానికి రూ.1.50లక్షలు అప్పు చేసి వర్క్ వీసాపై ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి అక్కడికెళ్లాడు. దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన శ్రీకాంత్ అక్కడి ఏజెంట్‌కు తాను వచ్చినట్లు సమాచారమందించాడు. కంపెనీ పనిలో చేరిన శ్రీకాంత్ ఐదు రోజులు పని చేసిన క్రమంలో మతిస్థిమితం సరిగా లేక అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అక్కడి కంపెనీ వారి ఫిర్యాదుతో దుబాయ్‌లోని జేబులలి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మతిస్థిమితం సరిగా లేని కారణంగా ఎవరికి చెప్పకుండా జేబులలి ప్రాంతానికి వెళ్లడం మూలంగానే దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి కార్మికులు కుటుంబ సభ్యులకు సమాచారమందజేశారు.
ఇంటికి పంపండి..
తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, గల్ఫ్ వెళ్లడానికి అన్ని పరీక్షలు చేసిన అనంతరమే అక్కడికి వెళ్లాడని, కొడుకును క్షేమంగా ఇంటికి పంపాలని శ్రీకాంత్ తల్లి లక్ష్మి వేడుకుంటోంది. పోలీసుల అదుపులో ఉండడం భయంగా ఉందని, ఈ విషయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జోక్యం చేసుకొని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇంటికి రప్పించాలని కోరుతోంది.
పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం
భయాందోళనలో కుటుంబ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment