యాసంగికి ఎల్‌ఎండీ నీరు
● కాకతీయ కాలువ ద్వారా విడుదల ● స్విచ్ఛాన్ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి ● మార్చి 31వరకు కొనసాగనున్న తరలింపు ● 6.90 లక్షల ఎకరాలకు సాగునీరు
తిమ్మాపూర్: ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని దిగువ మానేరు జలాశయం నుంచి దిగువకు యాసంగి పంటల కోసం మంగళవారం సాగునీటిని విడుదల చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి స్విచ్ఛాన్ చేసి కాకతీయ కాలువ ద్వారా నీటిని వదిలారు. ఆయకట్టు విస్తీర్ణం, జలాశయం సామర్థ్యం, విడుదల చేస్తున్న నీటి కెపాసిటీ గురించి నీటిపారుదలశాఖ ఎస్‌ఈ పెద్ది రమేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల కొనసాగించాలన్నారు. 4 వేల క్యూసెక్కుల నీటిని మొదటివారం జోన్–2 పరిధిలోని సూర్యాపేట వరకు, జోన్–1 పరిధిలోని మహబూబాబాద్ వరకు మరో వారం రోజుల చొప్పున విడుదల చేస్తామని వివరించారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఈ సూచించారు.
44.480 టీఎంసీలు..
యాసంగి సీజన్‌కు మొత్తం 44.480 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్‌ఈ రమేశ్ తెలిపారు. మొత్తం 6.97 లక్షల ఎకరాలకు మార్చి 31 వరకు నీటి విడుదలను కొనసాగిస్తామని తెలిపారు. జోన్ 1, జోన్ 2 పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదలను కొనసాగిస్తామన్నారు. రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. 11టీఎంసీల నీటిని మధ్య మానేరు ద్వారా, ఐదు టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా సేకరించి విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం లోయర్ మానేరు జలాశయంలో 22.870 టీఎంసీల నీరు ఉందని పేర్కొన్నారు. ఈఈ నాగభూషణం, డీఈ శ్రీనివాస్, ఏఈలు వంశీధర్, దీపిక, సంజన, కిరణ్ ఉన్నారు.
ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి
మానకొండూర్/శంకరపట్నం: ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. మానకొండూరు, కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని పరిశీలించారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని అన్నారు. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 13 ఏళ్లు దాటిన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పలు రికార్డులను పరిశీలించి, తగు సూచనలు చేశా రు. కేశవపట్నం పీహెచ్‌సీలో ఓపీ రిజిష్టర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పీహెచ్‌సీకి వచ్చిన వంకాయగూడెం గ్రామానికి చెందిన రేణుక ప్రైవేట్ ఆస్పత్రిలో కొనుక్కున్న మందులు వాడితే పని చేయడం లేదని, మూడు నెలలుగా ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకుని మందులు వాడుతున్నానని కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని ఇతరులకు చెప్పాలని రేణుకకు కలెక్టర్ సూచించారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, వైద్యాధికారులు సౌమ్య, సల్మాన్, సీహెచ్‌వో రాజు నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment