అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు...
కరీంనగర్: 2025 ఏడాదిలో ప్రతీ ఒక్కరికి మంచి జరగాలి. జిల్లా ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 20ఏళ్లుగా ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పి స్తున్న నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా. కరీంనగర్ రూపురేఖలను మార్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేశా. హైదరాబాద్ తరువాత కరీంనగర్‌ను రెండో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాను. గత అభివృద్ధినే స్ఫూర్తిగా తీసుకుని, మరింత ముందుకు సాగుతా.
– గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే
ప్రజలకు అండగా ఉంటా
హుజూరాబాద్: నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో గెలిపించారు. వారికో సం సేవకుడిలా పనిచేస్తా. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నా ఇంటి తలుపులు 24గంటలు తెరిచి ఉంటాయి. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందే వరకు పోరాడుతా. వీణవంక, జమ్మికుంట మండలాల్లో రైతుల కోసం కల్వల ప్రాజెక్టు నిర్మాణం, జమ్మికుంట నాయిని చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడం, జమ్మికుంట స్టేడియం, ఇల్లందకుంటను టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తాను. – పాడికౌశిక్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
మానకొండూర్: మానకొండూర్ నియోజకవర్గంలో విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ప్రజల అవసరాలు తీర్చడంలో ముందుంటాను. మానకొండూర్, ఇల్లంతకుంట మండలకేంద్రాల్లో 50 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ప్రకటిస్తున్నాం. మండలంలోని నూతనంగా రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తున్నా. పేదలకు అండగా ఉంటూ.. కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో అమలు అయ్యేలా కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను.
– కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూర్ ఎమ్మెల్యే
కొండగట్టు అభివృద్ధికి కృషి
చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుతాను. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు ఇలవేల్పు అయిన కొండగట్టు దేవస్థానంలో అభివృద్ధి చర్యలు చేపడతాను. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తాను. చొప్పదండి పరిధిలో రోడ్లు, సాగునీరు, విద్య తదితర రంగాలలో మెరుగైన ప్రగతి సాధిస్తాము. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.
– మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment