బైక్ చెట్టుకు ఢీకొని మైనర్ దుర్మరణం
పాలకుర్తి(రామగుండం): మిత్రులందరూ కలిసి కొత్త సంవత్సరం 2025కు స్వాగతం పలికేందుకు ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అర్ధరాత్రి వరకూ ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత టీ తాగేందుకు బుధవారం వేకువజామున బైక్‌పై టీకొట్టుకు వెళ్తున్నారు. అతివేగానికి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నెరువట్ల హరినాథ్(15) దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో రాజీవ్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. బసంత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. పాలకుర్తి మండలం ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నెరువట్ల తిరుపతి – శ్రీలత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్నకుమారుడు హరినాథ్ బసంత్‌నగర్ ఇండియా మిషన్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుచున్నాడు. మిత్రులతో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నాడు. తెల్లవారుజామున బసంత్‌నగర్ నుంచి కన్నాల టోల్‌ప్లాజా వెళ్లేందుకు యమహా బైక్‌పై హరినాథ్, మరో బైక్‌పై ఇంకో ముగ్గురు మిత్రులు బయలు దేరారు. మార్గమధ్యలో పాత బ్రాందీషాపు దాటిన తర్వాత గల మూలమలుపు వద్ద హరినాథ్ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో బాలుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108 వాహనం ద్వారా పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సరం రోజే రోడ్డు ప్రమాదం జరగడంతో ఆ ఇంట్లో విషాదం అలముకుంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు..
ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదంలో ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామానికి చెందిన ఈదులకంటి రిషిత్‌రెడ్డి(20) మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈదులకంటి మహేందర్ రెడ్డి–చైతన్య దంపతుల కుమారుడు రిషిత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన స్నేహితుడితో కలిసి బైక్‌పై బయటకు వెళ్లాడు. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ పోయిస్తుండగా రిషిత్‌రెడ్డి రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రిషిత్‌రెడ్డి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించగా మృతుడి స్నేహితులు, గ్రామస్తులు తరలివచ్చి, కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment