‘ఫీజు’ బకాయిలు విడుదల చేయాలి
కరీంనగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ, యువజన, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా, జిల్లాలో బీసీ విద్యార్థులకు రూ.131.35 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు రూ.171 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రావాల్సి ఉందన్నారు. గత మూడేళ్లలో రీయింబర్స్‌మెంట్ కోసం 1.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 16.70 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.9,200 కోట్లు మాత్రమే కేటాయించిందని, అవి ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందించారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం, మహిళా అధ్యక్షురాలు గుంటి స్వరూప, బీసీ యువజన సంఘం నగర అధ్యక్షుడు అనుమాస నితిన్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, బీసీ యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగంపల్లి శ్రీనివాస్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment