మైసూరు: చామరాజనగర జిల్లాలోని కొళ్లేగాలలో రేఖా (29) అనే ఒంటరి మహిళ ఇంట్లో అనుమానస్పదంగా మరణించగా, ఆమె కూతురు కనిపించడం లేదు. ఈ సంఘటన మిస్టరీగా మారింది.
వివరాలు.. శనివారం సాయంత్రం కొళ్లేగాల పట్టణం ఆదర్శ నగరలోని ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో రేఖా మృతదేహం కనిపించింది. ఆమె ఆరేళ్ల కూతురు మాన్విత ఎక్కడుందో తెలియడం లేదు. వారం రోజుల నుంచి మాన్విత పాఠశాలకు రాకపోవడంతో ఏమైందోనని టీచర్.. రేఖాకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేదు. దీంతో ఉపాధ్యాయురాలు నేరుగా రేఖా ఇంటికే వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో రేఖా మృతదేహం పడి ఉంది. భయాందోళనకు గురైన ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా రేఖా బంధువులు అడ్డుకున్నారు. హంతకులను పట్టుకునేవరకూ మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని గలాటాకు దిగారు. చివరకు పోలీసులు సర్దిచెప్పారు.
గతంలో రేఖా భర్త ఆత్మహత్య
రేఖాతో అక్రమ సంబంధం ఉన్న కెఈబి లైన్‌మెన్ నాగేంద్ర అలియాస్ ఆనందన్ పైన అనుమానం వస్తోంది. అతడు కూడా వారం రోజుల నుంచి పత్తా లేడు. రేఖా– నాగేంద్ర వ్యవహారం తెలిసి ఆమె భర్త సునీల్ విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త అడ్డు తొలగిపోవడంతో నాగేంద్రకు చెందిన ఇంటిలో ఇద్దరూ సహజీవనం చేయసాగారు. రేఖాను పెళ్ళి చేసుకుంటానని చెప్పేవాడు. కానీ కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాంతో రేఖాను నాగేంద్ర హత్య చేసి మాన్వితను తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్ర, పాప కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment