కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
మండ్య: రామమందిరం నిర్మాణం కోసం జరిగిన ఉద్యమానికి సంబంధించి 31 ఏళ్ల నాటి కేసును ప్రభుత్వం వెలికితీసి హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారిని అరెస్టు చేయడంపై బీజేపీ కార్యకర్తలు ఉద్యమించారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ నగరంలోని వికాసభవనం వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బెంగళూరు–మైసూరు రహదారి మీదుగా కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వెళ్లి అక్రమ అరెస్టు ఖండిస్తూ శ్రీకాంత్ పూజారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రికి సత్కారం
శివాజీనగర: రాష్ట్ర రవాణా, దేవదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి అధ్యక్షతన బుధవారం
రాష్ట్ర ధార్మిక పరిషత్ 2వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధార్మిక పరిషత్ సభ్యులు, అధికారులు మంత్రి రామలింగారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ధార్మిక పరిషత్ సభ్యుడు డాక్టర్ ఏ.రాధాకృష్ణరాజు, రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ బసవరాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన పెంచాలి
గౌరిబిదనూరు: వ్యవసాయ విద్యపై విద్యార్థులు శ్రద్ధ చూపాలని, ఆధునిక పద్ధతులపై రైతులలో అవగాహన కల్పించాలని మాజీ వ్యవసాయశాఖా మంత్రి శివశంకరరెడ్డి తెలిపారు. తాలూకాలోని మంచేనహళ్లి దగ్గర హళేహళ్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కృషి ధారె కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ విద్యార్థులు తరగతులకు పరిమితం కాకుండా గ్రామీణ ప్రదేశాల అనుభవాన్ని పొందడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ మాట్లాడుతూ వ్యవసాయంలోని పరిశోధన ఫలాలు గ్రామీణ రైతులకు అందాలని అన్నారు.
‘యువనిధి’ ప్రారంభానికి
పకడ్బందీగా ఏర్పాట్లు
శివమొగ్గ: ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన ‘యువనిధి’ని ఈ నెల 12న శివమొగ్గ నగరంలోని ఫ్రీడం పార్కు భవ్య వేదికపై ప్రారంభించనున్నట్లు వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి డాక్టర్ శరణ ప్రకాశ్ ఆర్.పాటిల్ తెలిపారు. జిల్లా పాలన భవనం సభాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివమొగ్గ, చిత్రదుర్గ, చిక్కమగళూరు, హావేరి, ఉడుపి జిల్లాల జిల్లాధికారులు, సీఈవోలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఫ్రీడం పార్కును పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభోత్సవంలో సుమారు లక్ష మందికి పైగా డిప్లొమా, డిగ్రీ నిరుద్యోగ యువకులు పాల్గొననున్నట్లు అంచనా ఉందన్నారు. సీఎం సిద్దరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు, ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
బాలికల హాస్టల్ పరిశీలన
మండ్య: జిల్లాధికారి డాక్టర్ కుమార బుధవారం డి.దేవరాజ అరస్ మెట్రిక్ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి అక్కడి సౌకర్యాలపై చర్చించారు. ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలు, వెసులుబాట్లను ఉపయోగించుకుని మంచి దేశ పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు. చక్కగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందాలని అభిలషించారు. అనంతరం కట్టేరి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కేంద్రానికి కూడా జిల్లాధికారి సందర్శించారు. ఆహార పదార్థాలను నాణ్యతతో అందించాలని, పిల్లాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment