అరుదైన ఘటనపై సర్వత్రా ప్రశంసలు
దేహదానంపై జాగృతికి మరింత స్పూర్తి
పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న వైద్యుడు
హుబ్లీ: దేహదానం చేసిన తండ్రి మృతదేహంతో వృత్తిపరంగా వైద్యుడైన కుమారుడే ప్రయోగాలు చేసి అందరిలో స్పూర్తి నింపిన అరుదైన ఘటన 14 ఏళ్ల తర్వాత కూడా అందరికీ ప్రేరణ కల్గిస్తోంది. దేహదానంపై ఆయన కలిగించిన స్పూర్తితో ఏకంగా స్వామీజీలు కూడా దేహదానానికి సిద్ధం కావడం విశేషం. 17వ శతాబ్దం చివరి దశలో వైద్య రంగంలో పరిశోధనలో నిమగ్నమైన ఇంగ్లాండ్ ఫ్లోగ్‌స్టోన్ కెంట్ సర్ విలియమ్ హార్వేవే తన మృత సోదరి దేహాన్ని ముక్కలు చేసి మానవ దేహంలో రక్తప్రసరణ విధానాన్ని కనుగొన్నారు. ఆనాటి సంఘటననే ప్రేరణగా డాక్టర్ మహంతేష్ రామన్నవర తీసుకుని మృతి చెందిన తన తండ్రి దేహాన్ని ముక్కలు చేసి వైద్య రంగానికి ఆదర్శప్రాయం అయ్యారు. కుందానగరి బెళగావి జిల్లా బైలహొంగల నగర ప్రముఖ వైద్యుడైన డాక్టర్ బసవన్నప్ప సంగప్ప రామన్నవర వాగ్దానం మేరకు ఆయన మరణానంతరం 2008 నవంబర్ 13న దేహదానం చేశారు.
కేఎల్‌ఈ ఆస్పత్రికి దేహదానం
ముందుగా హుబ్లీ కిమ్స్‌కి దానం చేస్తానన్న ఆయన అనంతరం కుమారుడు వైద్యుడిగా పని చేసే బెళగావిలోని కేఎల్‌ఈ ఆయుర్వేదిక్ కళాశాలకే దానం చేయాలని ముందుగానే హామీ పత్రంపై సంతకం చేశారు. ఆయన కోరిక మేరకు కుందానగరి బెళగావిలోని సదరు కళాశాలకు తండ్రి మృతదేహాన్ని దానం చేసిన డాక్టర్ మహంతేష్ రెండేళ్ల పాటు ఆ మృతదేహాన్ని అలాగే నిల్వ ఉంచారు. 2010 నవంబర్ 13న శరీరాన్ని ముక్కలు చేసి వైద్య విద్యార్థులకు పాఠశాలను బోధించడం తనకెంతో స్పూర్తినిచ్చిందని డాక్టర్ మహంతేష్ రామన్నవర అభిప్రాయ పడ్డారు. తండ్రి ఇచ్చిన స్పూర్తితో మరణానంతరం దేహదానంపై ఈ డాక్టర్ గ్రామ గ్రామాలకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేపట్టి అందరిలో జాగృతి కల్పించడం హర్షనీయం కాగా తండ్రి మృతదేహం దానంతో ప్రేరణ పొందిన కారంజిమఠం గురుసిద్ద స్వామి స్వయాన వాగ్దాన పత్రంపై సంతకం చేశారు.
దేహదానానికి భక్తుల అంగీకారం
స్వామీజీ ప్రేరణతో 200 మందికి పైగా భక్తులు దేహదానానికి అంగీకరిస్తూ హామీ పత్రాలు ఇచ్చారు. ఆ మేరకు సౌదత్తి తాలూకా మునవళ్లి సోమశేఖర మఠ మురుగేంద్ర స్వామి కూడా నేత్రదానానికి హామీ ఇవ్వడంతో ఇదే ప్రేరణగా సుమారు 375 మందికి పైగా ప్రజలు మరణానంతరం తమ నేత్రాలు, చర్మంతో పాటు దేహదానానికి ఒప్పుకున్నారు. ఆ మేరకు ఇప్పటి వరకు హామీ ఇచ్చిన 8 మంది మృత దేహాలను రామన్నవర చారిటబుల్ ట్రస్ట్‌కు అప్పగించారు. ఇలా చనిపోయిన తండ్రి ఆశయ సాధనకు వైద్య రత్నగా అందరిలో ప్రేరణ కలిగిస్తూ దేహ దానాలకు కృషి చేస్తున్న డాక్టర్ మహంతేష్ ప్రస్తుతం కేఎల్‌ఈ బీఎం కంకణవాడి ఆయుర్వేదిక్ కళాశాల ముఖ్యస్తులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ డాక్టర్ కృషికి అప్పటి కేంద్ర మంత్రి గులామ్ నబీ అజాద్, కేఎల్‌ఈ ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ప్రభాకర్ కోరే సూచనల మేరకు తన తండ్రి దేహదాన ప్రయోగ రోజు సందర్భంగా వైద్య సమ్మేళనాలు నిర్వహిస్తూ సమాజానికి ఈ వైద్యుడు ఇస్తున్న ప్రేరణ మాత్రం అచంచలమైనదని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment