కలిసుందాం పద
గౌరిబిదనూరు: చిన్న చిన్న గొడవలతో దాంపత్య జీవనానికి దూరమై కోర్టుల చుట్టూ తిరుగుతున్న జంటలకు లోక్ అదాలత్ ఒక్కటి చేసింది. కోర్టులో దండలు మార్చుకొని మళ్లీ కలిసిపోవడం అందరికీ ఆనందాన్నిచ్చింది. తాలూకా న్యాయసేవా సమితి, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శనివారం బృహత్ లోక అదాలత్ జరిగింది. జడ్జిలు గీతా కంబార్, పిఎం సచిన్ విచారణ జరిపారు. 56 సివిల్ కేసులు, 256 క్రిమినల్ కేసులు, 17 చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా విడాకులు కోరిన పలు జంటలకు బుద్ధిమాటలు చెప్పి రాజీ చేయించారు. న్యాయవాదులు త్రివేణి, సురేశ్, హరీశ్, రామదాసు, విజయరాఘవ పాల్గొన్నారు.
చాముండేశ్వరి కొండపై అపచారాలు!
● పరస్పరం ఆరోపణలు
మైసూరు: మైసూరులో సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ సీఎం సిద్దరామయ్య కుటుంబంపై ముడా ఇళ్ల స్థలాల ఆరోపణలు చేస్తే, ఆయనపై పలువురు ఇతరత్రా కేసులు పెడుతున్నారు. తాజాగా మైసూరు చాముండి కొండపై చాముండేశ్వరి దేవస్థానంలో భక్తులు సమర్పించిన చీరలను కృష్ణ దొంగిలించాడని ఆలయ కార్యదర్శి రూపా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణరాజ పోలీసులకు ఆమె వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. అలాగే ఆలయంలో తన విధులకు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కృష్ణపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రూపపై మొదట ఫిర్యాదు
నాడినశక్తి దేవత చాముండేశ్వరిదేవికి కానుకలుగా వచ్చిన లక్షలాది రూపాయల విలువ చేసే చీరలను కార్యదర్శి రూపా.. బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని స్నేహమయి కృష్ణ ఇటీవల ఆరోపణలు చేశారు. కృష్ణరాజ పోలీసులకే వీడియో సమేతంగా ఫిర్యాదు కూడా చేశారు. రూపా ఆలయం నుంచి చీరలను కారులో నింపుకొని వెళ్లి విక్రయిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రూపా ఎదురు కేసులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. చివరికి మైసూరులో స్నేహమయి హాట్ టాపిక్ అయ్యారు. తరచూ కొత్త కొత్త విషయాలు బహిర్గతం అవుతున్నాయి.
బిళిగిరి అడవుల్లో కొత్త జీవి
● ఖనిజ పురుగుగా వర్ణన
మైసూరు: జీవ వైవిధ్యానికి పెట్టని కోట అయిన చామరాజనగర జిల్లాలోని యళందూరు తాలూకాలోని ప్రసిద్ధ బిళిగిరి రంగన బెట్ట అడవుల్లో కొత్త రకం కీటకం కనిపించింది. స్థానిక పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏట్రి అటవీ పరిశోధనా సంస్థకు చెందిన పరిశోధకులు ఏపీ రంజిత్, ప్రియదర్శన్ ధర్మరాజన్ ఈ జీవిని కనిపెట్టారు. దీనిని ఖనిజ పురుగు గా పేర్కొన్నారు. బిళిగిరి రంగన బెట్టతో పాటు తమిళనాడులో కళకాడ్‌లోని ముండంతురై పులుల అభయారణ్యం, అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్, ఉత్తరాఖండ్‌లో ఈ కీటకం జీవిస్తుందని చెప్పారు. బిళిగిరిలో కనిపించిన ఈ కీటకానికి కింగ్‌కోబ్రాల పరిశోధకుడు డాక్టర్.పి.గౌరిశంకర్ గౌరవార్థం పేరు పెట్టారు.కొన్ని నెలల క్రితం ఇక్కడే కొత్త జాతికి చెందిన బల్లిని కనుగొన్నారు.
పులి మృత్యువాత
మైసూరు: మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటె పట్టణం సమీపంలో చాకహళ్ళి వద్ద పెద్ద పులి అనుమానస్పద రీతిలో చనిపోయింది. సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న యువ పులి సగం కళేబరం పడి ఉంది. నడుం నుంచి దాని దేహం లేదు. మరో పులితో జరిగిన పోట్లాటలో చనిపోయి ఉండవచ్చని అటవీ అధికారులు తెలిపారు. అటవీ వైద్యాధికారులు ముజీబ్, రమేష్‌లు పరిశీలించారు. మిగతా సగం దేహం ఏమై ఉంటుందనేది తీవ్ర అనుమానాలున్నాయి. చంపేసిన పులే ఆరగించి ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment