చిత్రసంతెలో జన సందోహం
బెంగళూరులో వైభవంగా చిత్రసంతె
వేలాది చిత్రలేఖనాల కనువిందు
సాగరంలా సందర్శకులు
బనశంకరి: సిలికాన్ సిటీలో చిత్రలేఖనాలు కనువిందు చేశాయి. పెయింటింగ్స్ అంటే సంపన్నులకు మాత్రమే పరిమితం కాదని, సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఏటా జనవరిలో జరిగే చిత్రసంతె ఆదివారం కళాప్రియులకు పండుగ చేసింది.
1,450 స్టాళ్లు
నగరంలో కుమారకృప రోడ్డులోని చిత్రకళా పరిషత్ ఆవరణలో, పరిసరాల్లో చిత్రసంతె సాగింది. కర్ణాటకతో పాటు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన కళాకారులు, సందర్శకులతో జనసంద్రంగా మారింది. వేలాదిమంది చిత్రకారులు వైవిద్యభరితమైన చిత్రలేఖనాలను ప్రదర్శించారు. సీఎం సిద్దరామయ్య పాల్గొని ప్రారంభించారు. 22 రాష్ట్రాలనుంచి 1,550 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. 1450 స్టాల్స్‌లో 40 వేలకు పైగా కళాకృతులను ప్రదర్శించారు. చిత్రలేఖనాలా, లేక ఛాయాచిత్రాలా అనే భ్రమ కలిగించేలా అద్భుతమైన పెయింటింగ్స్ సంభ్రమానికి గురిచేశాయి.
మనోహరమైన పెయింటింగ్స్
పెయింటింగ్స్ ఒకదానికి ఒకటి మించి మరొకటి సందర్శకులను కట్టిపడేశాయి. ప్రకృతి, పర్యావరణం, పల్లె జీవన సంస్కృతి, ఆలయాలు, వన్యజీవులు తదితర ఇతివృత్తంతో చిత్రలేఖనాలు ఉన్నాయి. ఈసారి యువ, మహిళా చిత్రకారిణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళాభిమానులు తమకు ఇష్టమైన పెయింటింగ్స్ కొనుగోలు చేశారు. కొందరు అక్కడే చిత్రాలను గీయించుకున్నారు. రూ.10 నుంచి లక్షలాది రూపాయల విలువచేసే కళాకృతుల వ్యాపారం జరిగింది. దేశంలో పేరుపొందిన అన్ని శైలుల పెయింటింగ్స్ ఒకచోట చేరడంతో ప్రజలకు కనువిందు అయ్యింది. ఆదివారం ఉదయం 10 గంటలు కాగానే సందర్శకుల తాకిడి అధికమైంది. మధ్యాహ్నం పరిసర రోడ్లు కిక్కిరిసిపోయాయి. యువత ఉత్సాహంగా మొబైల్స్‌లో ఫోటోలు తీసుకున్నారు. చిత్రసంతెకు వచ్చేవారి కోసం బీఎంటీసీ స్పెషల్ బస్సులు నడిపింది. రాత్రి వరకూ స్టాళ్లు కొనసాగాయి.
Comments
Please login to add a commentAdd a comment