ప్రేయసి దూరమైందని యువకుడు ఆత్మహత్య
హుబ్లీ: ప్రేమించిన యువతి తనకు దూరం అయిందన్న బాధతో ఓ యువకుడు ఉణకల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమరగోళ ఏపీఎంసీ నివాసి సందేశ్(27) మృతుడు. గత కొంతకాలంగా తాను ప్రేమించిన యువతి తనను వంచించిన నేపథ్యంలో సదరు యువతితో కలిసి తీసుకున్న ప్రైవేట్ వీడియాలు, మెసేజ్‌లను వైరల్ చేసి ఈ నెల 12న ఆ చెరువులో దూకి మృతి చెందాడని విద్యానగర పోలీసులు తెలిపారు. మంగళవారం మృతదేహం చెరువులో తేలటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా మృతుడు తల్లి ప్రీతికి వాయిస్ మెసేజ్ చేసి అమ్మా.. నేను ప్రేమించిన యువతి వేరొకరితో తిరుగుతోంది. ఆమెను వదిలేశాను. ఆమె చేసిన వంచనను మరచిపోలేక పోతున్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా అని వాయిస్ మెసేజ్ చేసి ఆత్మహత్మ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ యువకుడు నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అప్పట్లో ఎలాగోలా ఆస్పత్రిలో చేరి సకాలంలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడినట్లు తెలిసింది. తాజాగా యువతిపై మోజుతో భంగపడి చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పారా మెడికల్ విద్యార్థి మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో పారా మెడికల్ విద్యార్థి మృతి చెందిన ఘటన కలబుర్గిలో చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని నాలవారకు చెందిన కోరేష్ సిద్దణ్ణ(17)గా గుర్తించారు. మంగళవారం గ్రామంలో స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా గుండెపోటుకు గురై మరణించాడు.
పుట్టినిల్లు చేరిన భార్య కిడ్నాప్
దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా దిడగూరులోని పుట్టినిల్లు చేరిన భార్యను కిడ్నాప్ చేసిన భర్త ఉదంతం దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు..కొప్ప తాలూకా నరసీపుర నివాసి కార్తీక్‌తో దిడగూరు అరుంధతికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. అదనపు కట్నం కోసం అరుంధతిని నిత్యం వేధిస్తున్న నేపథ్యంలో అరుంధతి పుట్టినిల్లు చేరింది. మంగళవారం భర్త కార్తీక్ కుటుంబ సభ్యులు అరుంధతిని కిడ్నాప్ చేశారు. అడ్డుకున్న అరుంధతి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు కావడంతో హొన్నాళి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గాయకుడికి ఎస్పీబీ అవార్డు
రాయచూరు రూరల్: నగరానికి చెందిన గాయకుడు అమరేగౌడకు ఎస్పీ బాలసుబ్రమణ్యం అవార్డు లభించింది. ఈనెల 26న గోవాలోని పనాజీలో జరిగే కార్యక్రమంలో జాతీయ స్థాయి సాంత్వన మ్యూజిక్ అండ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డును గోవా శాసన సభ్యుడు, మాజీ స్పీకర్ మైకేల్ లోబో అందిస్తారని అనిల్, మారుతి వెల్లడించారు. పవిత్ర, ప్రభాకర్ రెడ్డి, మురళీ మోహన్, హరకళ్ హజబ్బ పాల్గొంటారని తెలిపారు.
నేత్రపర్వం.. మైలార ఉత్సవం
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలోని మైలారలో వెలసిన, భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన కురబ, యాదవుల కులదైవం మైలార లింగేశ్వరుని జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. బండారు(పసుపు) సమర్పణలో తలమునకులైన భక్తులు దేవుడిని ఊరేగించారు. నాగపూజలు జరిపి నాగోళి రోజున బహు పరాక్ అంటూ నినాదాలు చేస్తూ గొలుసులు తెంచి పసుపును చల్లుకున్నారు. జాతరలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment