ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం
బళ్లారి అర్బన్: దశాబ్దాలుగా ఉత్తర కర్ణాటక జిల్లాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, ఇప్పటి వరకు పాలించిన పాలకులందరూ ఆ ప్రాంతంపై సవతి తల్లి ధోరణి చూపారని, అందుకే ఈ 13 జిల్లాలను కలుపుకొని ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమం ప్రారంభిస్తామని మాజీ కార్పొరేటర్, జనగణ ఫెడరేషన్ అధ్యక్షుడు, రైతు నేత గంగిరెడ్డి తెలిపారు. ఆయన స్థానిక స్నేహ సంపుట కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రానికి ఉత్తర కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, వివిధ సంఘ సంస్థలు అందరూ మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. గత 76 ఏళ్ల నుంచి స్వాతంత్య్రం అనంతరం కూడా ఈ ప్రాంతం అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. కేంద్రంలోని యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణగా విభజించి రెండు రాష్ట్రాలు చేశారన్నారు. అప్పట్లో లోక్‌సభ విపక్ష నేత దివంగత సుష్మాస్వరాజ్, చిన్న చిన్న రాష్ట్రాలు అయితే త్వరగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ఉద్యమంలో భాగంగా వివిధ జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం డిమాండ్ చేస్తామన్నారు. ఉద్యమానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment