మా నేతలపైకి ఈడీ అస్త్రం
హుబ్లీ: బెళగావిలో నిర్వహిస్తున్న జైబాపు, జై భీం, జై రాజ్యాంగ సమావేశానికి రాకుండా ఈడీ ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను బెదిరిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ముడా స్కాంలో రూ.300 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ పత్రికా ప్రకటన వెల్లడించడం ద్వారా బీజేపీ ద్వేష, హింసా రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌లో పలుకుబడి గల నాయకులు రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంకగాంధీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందన్నారు. ఇప్పుడేమో సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ఈడీ అస్త్రం ప్రయోగించిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమాన పరచడాన్ని కప్పిపుప్చుకోవడానికి ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాథూరాం ఘాడ్సే ఆలోచనా విధానాలను కలిగిన బీజేపీ నేతలు గాంధీ తత్వాలను అంగీకరించడం సాధ్యం కాదన్నారు.
బీజేపీ ఎప్పటికీ రాజ్యాంగానికి వ్యతిరేకమే
బీజేపీ ఎప్పటికీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తు వచ్చిందన్నారు. సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా పని చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సొంత బలంతో ఎన్నికల బరిలో నిలిచిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రజలకు సుపరిపాలన అందించడంలో విఫలం అయిందన్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ వేరుగా పోటీ చేస్తోందన్నారు. ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఆలోచనా విధానాలను దేశ నలుమూలల తెలియజేసేందుకే జైబాపు, జైభీం, జై రాజ్యాంగ కార్యక్రమాన్ని బెళగావిలో ఏర్పాటు చేశామన్నారు. ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. ఈ కారణంగా ఈ నెల 21న జరిగే సమావేశం నేపథ్యంలో ముందస్తు సమావేశాన్ని శనివారం నిర్వహించామన్నారు. ధార్వాడ జిల్లా నుంచి 75 వేల మందికి పైగా ప్రజలు సమావేశంలో పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విశేషంగా ఈ బెళగావి సమావేశాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
తద్వారా బీజేపీ బెదిరింపులకు
పాల్పడుతోంది
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల
ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా
Comments
Please login to add a commentAdd a comment