గ్రామాలను దత్తత తీసుకోండి
హొసపేటె: తాలూకా స్థాయి అధికారులు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలను దత్తత తీసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని బెంగళూరు గ్రామీణ వ్యవహారాల శాఖ సంచాలకులు నాగేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆయన శనివారం విజయనగర జెడ్పీ కార్యాలయ హాలులో గ్రామీణ తాగునీరు, పారిశుధ్య విభాగం ద్వారా జల్‌జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్, ఎన్‌ఆర్‌జీఏ పథకాల ప్రగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. దత్తత తీసుకున్న పంచాయతీల జాబితాను కేంద్ర కార్యాలయానికి పంపాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకం కింద జిల్లాలో ఇంటింటికీ మరుగుదొడ్డి అనే అంశంలో జిల్లాలోని ప్రతి తాలూకా ప్రగతిని సమీక్షించాలని సూచించారు. ఈనెలాఖరులోగా వాస్తవ సమాచారాన్ని సేకరించి, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. చెత్త పారవేసే యూనిట్లలో సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించామని, వాటిని వెంటనే నిర్వహించి నివేదిక ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జల్‌జీవన్ మిషన్, ఇంటి హక్కు, గంగా యోజన పథకం అమలు ప్రాజెక్టు కింద చేపట్టిన పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో రోడ్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా సహాయ కార్యదర్శి జాఫర్ షరీఫ్, అధికారులు మహేష్, భీమప్ప లాలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment