నెలల తరువాత గుట్టురట్టు
దొడ్డబళ్లాపురం: మద్యపానానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను కిరాయి హంతకులతో అంతమొందించిందో సతీమణి. గుండెపోటుతో చనిపోయాడని ప్రచారం చేసింది. ఈ ఘటన బెళగావి జిల్లాలో వెలుగు చూసింది. యమకనమరడి పోలీసుల కథనం మేరకు... హుక్కేరి తాలూకా హట్టిఆలూరు గ్రామానికి చెందిన మహంతేశ్ (34), భార్య మాలా, గతేడాది ఏప్రిల్‌లో పడుకున్న చోటే అతడు చనిపోయాడు. గుండెపోటు వచ్చిందని మాలా అందరినీ నమ్మించింది.
తన అన్న చావుపై అనుమానాలు ఉన్నాయని అతని సోదరుడు కల్లప్ప జనవరి 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. భర్త నిత్యం తాగి వచ్చి వేధిస్తుండడంతో మాలా అదే గ్రామానికి చెందిన ఆకాశ్ అనే వ్యక్తికి రూ.70వేలు ఇచ్చి భర్తను హతమార్చాలని కోరింది.
దీంతో ఆకాశ్ తన స్నేహితులతో కలిసి మహంతేశ్‌కి మద్యం తాగించి తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. శవాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. మరో రూ. 30 వేలు ఫోన్ పే చేసింది. ఉదయం మాలా భర్త గుండెపోటుతో మృతిచెందాడని గగ్గోలు పెట్టింది. అంత్యక్రియలను పూర్తి చేశారు. శనివారంనాడు పోలీసులు శవాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. పోలీసులు ఆకాశ్, రమేశ్, అప్పణ్ణ, వీరికి సహకరించిన మరో మహిళను, అలాగే మాలాని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment