వంచక నయన అరెస్టు
కృష్ణరాజపురం: పోలీసుల వేషంలో హనీట్రాప్‌కు పాల్పడి పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నయన (20) అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఈ గ్యాంగ్‌లోని సంతోష్, అజయ్, జయరాజ్‌లను అరెస్టు చేసిన బ్యాడరహళ్లి పోలీసులు తాజాగా ఆమెను అరెస్టు చేశారు. నిర్మాణ కాంట్రాక్టర్ (57)ని పరిచయం చేసుకున్న నయన మాయమాటలతో అతని నుంచి తరచుగా రూ.5 వేలు, రూ.10 వేలను ఇప్పించుకొనేది. ఓసారి టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది. వలలో పడిన బాధితుడు ఆమె స్కూటీని ఫాలో చేసుకుని ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంటిలో ఉండగా పోలీసులమని చెప్పి వచ్చిన దుండగులు వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. కాంట్రాక్టర్‌ను కొట్టి దుస్తులు విప్పించి ఫొటోలు తీసుకున్నారు. కింద మేడం ఉన్నారు, ఇక్కడే సెటిల్ చేసుకోమని బెదిరించి రూ.29 వేల నగదు, ఫోన్‌పేలో రూ.26 వేల నగదు, వంటిపై ఉన్న రూ.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసు, ఉంగరం, బ్రాస్‌లెట్‌ను లాక్కొని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
ఎస్‌ఐ కట్నం వేధింపులు
యశవంతపుర: చట్టాన్ని కాపాడాల్సిన ఎస్‌ఐ.. అధిక కట్నం కోసం భార్యను పీడిస్తున్నాడు. చిక్కమగళూరు జిల్లా కళసలో ఈ సంఘటన జరిగింది. కళస పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ నిత్యానంద.. మరో మహిళతో ఆక్రమ సంబంధం పెట్టుకుని, నాపై రోజు దాడిచేసి మరింత కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడనని భార్య అమిత ఫిర్యాదు చేశారు. పోలీసు క్వార్టర్స్‌లో ఉంటున్నామని, నిత్యం కొట్టి వేధిస్తున్నాడని వాపోయింది. ఎస్‌ఐతో పాటు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యార్థి ఆత్మహత్య
బనశంకరి: కాలేజీ అంతస్తు పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నగరంలో బసవనగుడి ఠాణా పరిధిలో శనివారం జరిగింది. అక్షయ్‌రెడ్డి (22) బసవనగుడి బీఎంఎస్ కాలేజీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ఫైనలియర్ విద్యార్థి. కాలేజీ పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై మరణించాడు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఎలాంటి డెత్ నోట్ లభించలేదు.
డ్రగ్ పెడ్లర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు ఉత్తర తాలూకా చిక్కబాణావరలోని వినాయకనగనలో ఆఫ్రికాకు చెందిన డ్రగ్ పెడ్లర్‌ను సోలదేనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. క్రిస్టోఫర్ అనే నిందితుని నుంచి రూ.40 లక్షల విలువైన గంజాయి, 166గ్రాముల ఎండీఎంఎం డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఎయిర్ షో..
మాంసానికి చిక్కులు
దొడ్డబళ్లాపురం: యలహంకలోని భారతీయ వైమానిక స్థావరంలో ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఏరో ఇండియా ప్రదర్శన జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకూ యలహంక చుట్టుపక్కల మాంసం షాపులను మూసివేయాలని బెంగళూరు పాలికె ఆదేశించింది. యలహంక చుట్టుపక్కల 13 కిలోమీటర్ల మేరకు మాంసం విక్రయాలు జరపరాదని దుకాణాలు, హోటళ్లకు నోటీసులు ఇచ్చింది. మాంసం ముక్కల కోసం పక్షుల సంచారం వల్ల విమానాలకు ఆటంకం కలుగుతుందని ఈ ఆంక్షలను విధించారు. అలాగే చుట్టుపక్కల పొడవైన క్రేన్లను ఉపయోగించరాదని ప్రకటించారు.
వీడియోలు
వీక్షించిన ప్రజ్వల్
దొడ్డబళ్లాపురం: హాసన్ జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన కేసుకు సంబంధించిన అశ్లీల వీడియోలను తిలకించాడు. ఈయనతోపాటు నిపుణుల బృందం, లాయర్ కూడా ఉన్నారు. విచారణలో భాగంగా కోర్టులో సదరు వీడియోలను చూశారు. పరప్పన అగ్రహార జైలు నుండి ప్రజ్వల్‌ను కోర్టుకు తీసుకువచ్చి ఈ ప్రక్రియను నిర్వహించారు. అవి నిజమైనవా, కాదా, అందులో ఉన్నది మీరేనా, కాదా? అని లాయర్లు ప్రశ్నించారు. ప్రజ్వల్ లాయర్ అరుణ్ వాదిస్తూ టీవీ చానెళ్లలో ప్రజ్వల్‌కు సంబంధించిన వార్తలు ప్రసారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని జడ్జిని కోరారు. కానీ జడ్జి ఇందుకు సమ్మతించలేదు. మీడియా మీద ఆంక్షల్ని విధించడం సమంజసం కాదని స్పష్టంచేశారు. కాగా, వీడియోలను మరింత సేపు చూస్తానని ప్రజ్వల్ కోరగా జడ్జి తిరస్కరించారు. తరువాత ప్రజ్వల్‌ని జైలుకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment