ఊడిపడిన భారీ బెలూన్
బీదర్ జిల్లాలో కలకలం
హైదరాబాద్ నుంచి ప్రయోగం!
సాక్షి బెంగళూరు: ఎక్కడో బిహార్ నుంచి ఇద్దరు దోపిడీ దొంగలు బీదర్‌కు వచ్చి పట్టపగలు ఇద్దరిని కాల్చిచంపి కోటిరూపాయల నగదును ఎత్తుకెళ్లిన ఘటనతో జిల్లాలో ఓ రకమైన ఆందోళన నెలకొంది. ఇంతలో అంతరిక్షం నుంచి భారీ స్థాయి వస్తువు నేలకూలడంతో జనం ఏమైందోనంటూ కలవరానికి గురయ్యారు.
జలసంగిలో ల్యాండింగ్
జిల్లాలోని హుమనాబాద్ తాలూకా జలసంగి గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. గ్రామంలోని ఒక ఇంటి పక్కనే ఉన్న వేప చెట్టు మీద పెద్ద బెలూన్ పడింది. ఈ బెలూన్‌కు పలు యంత్రోపకరణాలు అమర్చి ఉన్నాయి. ఈ మెషీన్ నుంచి రెడ్ లైట్ వెలుగుతుండడంతో గ్రామస్తులు భయపడ్డారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ హాని కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
టాటా రీసెర్చ్ సంస్థది
హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థకు చెందిన బెలూన్‌గా గుర్తించారు. శుక్రవారం 10 గంటలకు వాతావరణ అధ్యయనం కోసం దీనిని ప్రయోగించినట్లు తెలిసింది. ఇది కొన్నిరోజుల పాటు ఆకాశంలో ఎగురుతూ వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. దీనిని వెదర్ బెలూన్ లేదా సౌండింగ్ బెలూన్ అంటారు. చివరకు ఎక్కడో ఒకచోట పడిపోతుంది. ఆ సంస్థ నుంచి నిపుణులు వచ్చేదాకా అక్కడ పోలీసులు కాపలా ఉన్నారు.
బెలూన్‌లో లేఖ..
బెలూన్‌లో కన్నడ భాషలో రాసిన ఒక లేఖ లభించింది. అందులో ‘ఇదొక శాసీ్త్రయ పరికరం. టీఐఎఫ్‌ఆర్ బెలూన్ సౌలభ్యం ఇందులో ఉంది. దయచేసి కింద సూచించిన సూచనలు పాటించినవారికి బహుమతి అందిస్తాము’ అని ఉంది. అందులోని సూచనలు...
మెషీన్‌లో ఏముందో తెరిచి చూడకుడదు
ఇందులోని అన్ని వస్తువులను కాపాడాలి
ఈ పరికరం కింద పడిన స్థానం నుంచి కదిలించకూడదు
సమీపంలోని పోలీసు స్టేషన్‌లో తెలియజేయాలి
కింద ఇచ్చిన దూరవాణి నంబర్‌కు కాల్ చేయాలి
ఈ పరికరాన్ని చెడగొడితే పోలీసు కేసు ఎదుర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment