హుబ్లీ: అమరగోళ ఏపీఎంసీ ఆవరణలో ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఎండుమిర్చి మేళా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర సాంబారు పదార్ధాల అభివృద్ధి మండలి ఎండీ బీఆర్ గిరీష్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వరుసగా గత 12 ఏళ్ల నుంచి ఈ మేళాను ఏటా విజయవంతంగా కొనసాగిస్తున్నామన్నారు. దీంతో రైతులకు, వినియోగదారులకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. మిర్చి రైతులు, వినియోగదారులు, శాస్త్రవేత్తలు, సంస్కరణదారులను ఒకే వేదికలో చేర్చడంతో పాటు ఎండుమిర్చి వ్యవసాయంలో ఇటీవల పరిశోధన వివరాలను సాగుదారులకు తెలియజేయడం, వివిధ వంగడాలు, సంస్కరించిన పదార్థాలను పరిచయం చేయడం ఈ మేళా ఉద్దేశం అన్నారు. మేళాలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన రైతులు తమ పేరును ఈ నెల 27లోగా సాంబార్ పదార్ధాల అభివృద్ధి మండలి కార్యాలయంలో సంప్రదించి భూమి పట్టా, ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ ప్రతులతో నమోదు చేసుకోవచ్చన్నారు. గత ఏడాది మేళాలో 100 మంది రైతులు పాల్గొనగా 305 క్వింటాళ్ల మిర్చి విక్రయాలు, రూ.1.37 కోట్ల వ్యాపారాలు జరిగాయన్నారు. ప్రస్తుత ఏడాది 2.19 లక్షల హెక్టార్లలో మిర్చిని సాగు చేశారన్నారు. ఆ మేరకు 3.37 లక్షల టన్నుల దిగుబడిని ఆశిస్తున్నామన్నారు. ఉద్యానవన శాఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్, అమరగోళ ఏపీఎంసీ సహకారంతో మేళా నిర్వహిస్తున్నామన్నారు. మండలి జనరల్ మేనేజర్ ఎస్‌ఆర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment