అన్నదాన ప్రభువే.. శరణం అయ్యప్పా..
● కొత్తగూడెం శ్రీ ధర్మశాస్తా ఆలయంలో మాలధారులకు నిత్యాన్నదానం ● 24ఏళ్లుగా మధ్యాహ్న భోజనం, రాత్రి అల్పాహారం ● ఏటా నవంబర్ 15నుంచి జనవరి 10వరకు నిర్వహణ
కొత్తగూడెంటౌన్: అయ్యప్ప మాల ధరించే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అయితే, స్వస్థలంలో ఉండే వారికి మధ్యాహ్న భోజనం, రాత్రి అత్పాహారానికి ఇబ్బంది లేకున్నా ఇంట్లో ప్రత్యేక వంట చేసే పరిస్థితులు లేని వారు, పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు సమస్య ఎదుర్కొంటారు. ఈ నేపథ్యాన కొత్తగూడెంలోని శ్రీధర్మశాస్తా ఆలయంలో గత 24ఏళ్లుగా మాలధారులకు మధ్యాహ్న భోజనం, రాత్రి అల్పాహారం ఉచితంగా సమకూరుస్తున్నారు.
అరటి ఆకుల్లో సద్ది..
కొత్తగూడెం రైటర్‌బస్తీలోని శ్రీధర్మ శాస్తా ఆలయానికి కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో అయ్యప్ప మాల ధరించిన వారు వందల సంఖ్యలో ఉంటారు. పట్టణ వాసులకే కాక మాల ధరించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సైతం ఈ ఆలయంలో ఏటా నవంబర్ 15నుంచి జనవరి 10వ తేదీ వరకు మధ్యాహ్న భోజనం, రాత్రి అల్పాహారం ఉచితంగా సమకురుస్తున్నారు. పెనగడపలోని తోటల నుంచి అరటి ఆకులు తెప్పించి భోజనం వడ్డిస్తుండడం విశేషం. దీంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి పనులపై వచ్చిన భక్తులు సైతం ఇక్కడ ‘సద్ది’ స్వీకరిస్తారు. దాతల సాయంతో 2000 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా రోజూ మధ్యాహ్నం 400 మందికి పైగా మాలధారులకు భోజనంతో పాటు రెండు రకాల కూరలు, మజ్జిగ సమకూరుస్తున్నారు. ఇక రాత్రి ఉప్మా, ఇడ్లీ, వడ వంటి అల్పాహారం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment