ఖమ్మంక్రైం: నూతన సంవత్సర వేడుకలను మంగళవారం జిల్లా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. అలాకాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వేడుకల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేస్తున్నట్లు వెల్లడించిన సీపీ.. మంగళవారం రాత్రి 9గంటల నుంచే ప్రధాన కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అందరూ అర్ధరాత్రి ఒంటి గంట లోగా వేడుకలు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని, అలాకాకుండా అనవసరంగా బయటకు వచ్చినట్లు తేలితే కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. ఈమేరకు సోమవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీపీ సునీల్‌దత్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే....
సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు
జిల్లాలోని సున్నిత ప్రాంతాలతో పాటు అన్ని ప్రార్ధనా మందిరాల వద్ద బందోబస్తు ఉంటుంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లు, లకారం ట్యాంక్‌బండ్, వెలుగుమట్ల అర్బన్ పార్కు తదితర ప్రాంతాల్లోనూ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తాం. నూతన సంవత్సర వేడుకలు కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇళ్లలోనే జరుపుకోవాలి. అలాకాకుండా రహదారులపై తిరుగుతూ మహిళలను ఇబ్బంది పెట్టొద్దు. వేగంగా వాహనాలు నడుపుతూ కాలనీల్లో తిరిగితే ఇళ్ల వద్ద రంగవల్లులు వేసే మహిళలు ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుంది. ఇక రోడ్లపై కేక్‌లు కట్ చేయడం, డీజేలు పెట్టి నృత్యాలు చేయడం, బాణసంచా కాల్చడం చేస్తే న్యూసెన్స్ కేసులు నమోదు చేస్తాం. ప్రధానంగా తల్లిదండ్రులు మైనర్లు అయిన పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు నెట్టొద్దు.
స్పెషల్, మొబైల్ పార్టీలు
పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరిగే వేడుకలు ప్రశాంతంగా ముగియాలన్నదే పోలీసు శాఖ లక్ష్యం. అందుకోసం జిల్లాలో 500మందికి పైగాపోలీసుల తో బందోబస్తు నిర్వహించనున్నాం. అడిషనల్ డీసీపీ స్థాయి మొదలు హోంగార్డుల వరకు బందోబస్తులో పాల్గొంటారు. వీరే కాక స్పెషల్ పార్టీలు, మొబైల్ బృందాలు రాత్రంతా గస్తీ తిరుగుతాయి. ఈ విషయాలను గమనించి జిల్లా వాసులు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment