సాగర్ నీరు వస్తేనే సాఫీగా..
● వైరా రిజర్వాయర్ ఆయకట్టులో రబీ సాగుపై ఆందోళన ● రిజర్వాయర్‌లో 13.1 అడుగుల మేర నీరు ● సాగు, తాగునీటి అవసరాల వినియోగంతో తగ్గుతున్న నీటిమట్టం
వైరా: జిల్లాలోని సాగు వనరుల్లో కీలకమైన వైరా రిజర్వాయర్‌లో నీటి మట్టం రోజురోజుకు పడిపోతోంది. ప్రస్తుత రబీలో రిజర్వాయర్ కింద సుమారు 15వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికే కొందరు రైతులు నారుమడులు సిద్ధం చేసుకోగా, పలువురు నాట్లు కూడా వస్తున్నారు. అయితే, సాగర్ జలాలు విడుదల చేస్తే తప్ప రబీలో సాగు సాఫీగా సాగడం కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు అధికారులు మార్చి చివర నుంచి రిజర్వాయర్ కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. అదే జరిగితే రబీ సీజన్ చివరలో ఇక్కట్లు ఎదురుకావడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రోజుకు 33 క్యూసెక్కుల నీరు అవసరం
రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యం 18.4 అడుగులు కాగా, ఖరీప్‌లో 25 వేల ఎకరాల్లో ఆయకట్టు కింద వరి సాగు చేశారు. ఇక ప్రస్తుతం రబీలో వరితో పాటు మొక్కజొన్న తదితర పంటల సాగు కోసం రోజుకు 33క్యూసెక్కుల నీరు అవసరమవుతోంది. కుడి కాల్వ పరిధిలో 8వేల ఎకరాలు, ఎడమ కాల్వ పరిధిలో అంచనా మేరకు సాగులోకి రావాలంటే పూర్తి స్థాయి నీటి మట్టం మేర ఉండాలి. ఇప్పటికే సుమారు 2వేల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, ఖరీఫ్ వరి పంట కోతలు వారంలోగా పూర్తయ్యాక రబీ సాగు విస్తీర్ణం పెరగనుంది. రిజర్వాయర్‌లో 1.6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ మార్చి చివరి వరకు సరిపోయే పరిస్థిఽతి కనిపించడం లేదు. సాగర్ జలాలను వైరా రిజర్వాయర్‌కు చేరిస్తే తప్ప రబీ గట్టెక్కడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు.
25 నుండి వారబందీ
వైరా రిజర్వాయర్‌కు వర్షాధారంగా తప్ప ఇతర మార్గాల్లో నీరు వచ్చే అవకాశం లేక ఏటా వేసవిలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఫలితంగా ప్రతీ సంవత్సరం వేసవిలో సాగర్ జలాలు విడుదల చేస్తేనే అటు సాగు, ఇటు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈసారి అవసరాలు పెరగనుండడంతో ఈనెల 25నుండి ఆయకట్టుకు వారబందీ విధానంలో నీరు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. వారం పాటు నీరు ఇచ్చి మరో వారం పాటు నిలిపివేయాలని ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. అయినప్పటికీ సాగర్ జలాలు విడుదల చేస్తే తప్ప మరో రెండు నెలల తర్వాతైనా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేకపోలేదు. ప్రస్తుతం రోజుకు 33 క్యూసెక్కుల మేర నీరు సాగుకు, మరో 37 క్యూసెక్కుల నీటని మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్నారు. రోజుకు ఈ 70 క్యూసెక్కులు కాక ఆవిరి రూపంలో మరో 3 క్యూసెక్కుల నీరు వృథా అవుతుండగా నీటిమట్టం పడిపోతోంది.
మార్చి చివరిలో ఆధునికీకరణ
రిజర్వాయర్ ఆధునికీకరణ పనులకు రూ.42 కోట్లు మంజూరు చేయగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నెలాఖరుకు అగ్రిమెంట్లు చేసి మార్చి చివరి నుండి పనులు ప్రారంభించేందుకు జల వనరుల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రిజర్యాయర్ 12వ నంబర్ తూము నుండి గైడ్‌వాల్స్‌ను, 8వ నంబర్ తూము కోస్తాల నుంచి గొల్లపూడిలోని 16వ నంబర్ తూము వరకు ఆధునికీకరించేలా ప్రణాళిక సిద్ధమైంది. ఈనేపథ్యాన అఽధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందిస్తే రబీలో వరి, మొక్కజొన్న పంటలకు ఇబ్బంది లేకుండా సాగునీరు విడుదల చేయడం సాధ్యమవుతుంది. లేకపోతే సాగుకే కాక తాగు అవసరాలకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
ఉన్నతాధికారులకు విన్నవించాం..
వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రబీలో వరి సాగుకు ప్రస్తుతం ఉన్న నీరు సరిపోయేలా లేదు. ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సాగర్ జలాలు రిజర్వాయర్‌లోకి విడుదల చేస్తే సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
– శ్రీనివాస్, జల వనరుల శాఖ డీఈ
Comments
Please login to add a commentAdd a comment