విస్తరణా.. హై లెవల్ వంతెనా?
● ఖమ్మం బైపాస్ రోడ్డుపై మొదలైన సర్వే ● తుది నిర్ణయంపై స్పష్టత ఇవ్వని అధికారులు
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో నానాటికీ ట్రాఫిక్ పెరుగుతూ ఇబ్బందిగా మారిన బైపాస్ రోడ్డు అభివృద్ధిపై యంత్రాంగం దృష్టి సారించినట్లు తెలిసింది. అయితే, రోడ్డును విస్తరించాలా, ఫ్లై ఓవర్ నిర్మించాలా అన్న అంశంలో సాధ్యాసాధ్యాల పరిశీలనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బైపాస్‌రోడ్డు హద్దులపై రెవెన్యూ అధికారులు శనివారం సర్వే చేశారు. ఖమ్మంలోని రాపర్తినగర్ వద్ద రైల్వే వంతెన నుండి వైరా రోడ్డులోని శ్రీశ్రీసర్కిల్ వరకు సర్వే విభాగం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటరావు ఆధ్వరఆయన ఖమ్మం అర్బన్, చింతకాని సర్వేయర్లు వి.నాగేశ్వరరావు, వి.నవీన్, చైన్‌మెన్ బిక్కన్ సర్వే మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న బైపాస్‌రోడ్డు నిర్మించిన సమయాన 110 అడుగుల మేర భూసేకరణ చేయగా.. అందులో నాలుగు లేన్ల రహదారి నిర్మించారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఆక్రమణలు జరిగియా అని పరిశీలిస్తూ మార్కింగ్ చేస్తున్నారు.
తరచుగా ప్రమాదాలు
సుమారు సుమారు 2 కి.మీ. పొడవైన బైపాస్ రోడ్డులోని ప్రధానంగా కొత్త బస్టాండ్, రాపర్తినగర్ జంక్షన్, ఇల్లెందు క్రాస్‌లోని ఎన్‌టీఆర్ చౌరస్తా, శ్రీశ్రీ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పెరిగింది. దీంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం ఉన్నతాధికారులు సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. బైపాస్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు నగరంలోకి రాకుండా నేరుగా వెళ్లేలా రాపర్తినగర్ వద్ద రైల్వే వంతన నుండి శ్రీశ్రీ సర్కిల్ వరకు ఫ్లైఓవర్(హైలెవల్ వంతెన) నిర్మించే యోచన ఉన్నట్లు సమాచారం. తద్వారా భద్రాద్రి జిల్లాతో ఏపీ రాష్ట్రంలోకి వెళ్లే వాహనాల రద్దీ తగ్గి నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందనే భావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే, హైలెవల్ వంతెన నిర్మించడమా అది సాధ్యం కాకపోతే నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరిస్తే ప్రయోజనం ఉంటుందా అనే అంశం పరిశీలన దశలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం చేపట్టిన సర్వే పూర్తయ్యాక ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. ఈ విషయమై సర్వే అధికారులను ఆరా తీస్తే మాత్రం కారణాలు తమకు తెలియదని, ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment