● టెండర్ లేకుండానే మొక్కల కొనుగోలు ● కేఎంసీలో నామినేషన్ పద్ధతిపై ఒకే కాంట్రాక్టర్‌కు బాధ్యత
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని, వారికి నచ్చిన ఒకరిద్దరికే పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తమ అవసరాల కోసం పనులను విభజించి నామినేషన్ పద్ధతిపై అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ, మిగతా వారికి మొండిచేయి చూపుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇటీవల కేఎంసీ పరిధిలో నాటేందుకు దాదాపు రూ.21 లక్షల వ్యయంతో మొక్కలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే, మొక్కల సరఫరా బాధ్యతలను టెండర్లు లేకుండా ఒకరికే అప్పగించడం గమనార్హం. కేఎంసీ పరిధిలో అర్హులైన కాంట్రాక్టర్లు పదుల సంఖ్యలో ఉన్నా ఒకరికే బాధ్యతలు ఇవ్వడంతో మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నామినేషన్ పద్ధతే ఆధారం
నగర పాలక సంస్థలో రూ.5 లక్షల్లోపు పనులను టెండర్ లేకుండానే అధికారులు నామినేషన్ పద్ధతిపై కేటాయించే అవకాశముంది. ఇదే అదునుగా రూ.10లక్షలు, ఆపై విలువైన పనులను సైతం అధికారులు రూ.5 లక్షల లోపుగా విభజించి నామినేషన్ పద్ధతిపై నచ్చిన కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో డివైడర్లు, ప్రభుత్వ స్థలాల్లో కోనోకార్ఫస్ మొక్కలను తొలగించి వాటి స్థానంలో పూలు, పండ్ల మొక్కలను అధికారులు నాటించారు. అంతేకాక పార్క్‌లు, వాకింగ్ ట్రాక్‌ల్లోనూ మొక్కలను నాటించగా 6వేల మొక్కలను అధికారులు తెప్పించినట్లు తెలిసింది. ఒక్కో మొక్కకు రూ.350 వరకు వెచ్చించగా.. మొత్తం రూ.21 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంతమొత్తంలో నిధులు వెచ్చించాలంటే టెండర్ల పిలవడం తప్పనిసరి. అలా అయితే తమకు లాభం జరగదనుకున్నారో ఏమో కానీ అధికారులు ఐదు పనులుగా విభజించి నామినేషన్ పద్ధతిపై ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారని సమాచారం. ఈ అంశంపై ప్రస్తుతం కేఎంసీ కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment