తాము చెప్పినట్లు వినాలని అధికారులకు టీడీపీ మండల నాయకుల ఆదేశాలు
నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు
అధికారులను సైతం ఏక వచనంతో సంబోధిస్తున్న వైనం
షాడో ఎమ్మెల్యేల తీరుతో తలపట్టుకుంటున్న ఎమ్మెల్యే బాబు
సాక్షి నెట్‌వర్క్: ‘ఎమ్మెల్యే బాబు చాలా మెతక. ఏం మాట్లాడటం లేదని అనుకోవద్దు. మీరు అలా అనుకుని తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదు. బాబు వెనుక మేం ఉన్నాం. మా దృష్టికి అన్నీ తెలుస్తాయి. మేము చెప్పినట్లు వినాల్సిందే’ అంటూ ఆ నియోజకవర్గంలో అధికారులు, ఉద్యోగులపై టీడీపీ మండల స్థాయి నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. తన మాటను సైతం కాదని, తమ పంతమే నెగ్గాలనేలా షాడో ఎమ్మెల్యేల్లా మండల స్థాయి నాయకులు వ్యవహరి స్తున్న తీరు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. మండల స్థాయి నాయకులు తమను ఏకవచ నంతో పిలుస్తుండటం అధికారులకు మింగుడు పడటం లేదు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీ పట్నం పక్క నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ..
⇒ నియోజకవర్గంలోని ఒక మండలంలో పని చేస్తున్న ఎస్‌ఐకు తానున్నానంటూ ఎమ్మెల్యే బాబు భరోసా ఇచ్చారు. అయితే షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్న మండల నాయకుడు మాత్రం ఆ ఎస్‌ఐ బదిలీకి పట్టుబట్టారు. ఇటీవల పక్క నియోజకవర్గానికి చెందిన ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీకొట్టి ఆ మండలానికి చెందిన వృద్ధుడు తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఈ కేసును రాజీ చేయడంలో సదరు మండల స్థాయి నాయకుడు చక్రం తిప్పి పెద్దమొత్తంలో నగదును తన జేబులో వేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసును రాజీచేసే క్రమంలో సదరు ఎస్‌ఐ తనకు సహకరించలేదని ఆ నాయకుడు పగ పెంచుకున్నాడు. ఎస్‌ఐను బదిలీ చేయాల్సిందేనంటూ ఎమ్మెల్యే వద్ద భీష్మించుకుని కూర్చున్నాడు. అంతే కాదు ఎస్‌ఐని సూటిపోటి మాటలతో హింసిస్తున్నాడు. అధికార పార్టీ నాయకుడు కావడంతో ఈ విషయాన్ని బయటకు చెప్పు కోలేక చివరకు ఆ ఎస్‌ఐ కాస్తా బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతూ, విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.
⇒ వైఎస్సార్ సీపీ పాలనలో బుసక అక్రమ రవాణా, చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నా రంటూ గగ్గోలుపెట్టిన కూటమి నాయకులు ఇప్పుడు తామే అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువులు తవ్వడమే కాకుండా బుసకను రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేయాలని రెవెన్యూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.
⇒ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తన తండ్రి హయాంలో పనిచేసిన వారికి, తమకు అనుకూలంగా ఉంటామనే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఎమ్మెల్యే బాబు పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్నారు. ఈ పోస్టింగుల విషయంలో ఎమ్మెల్యే పీఏ, మండల స్థాయి నాయకుల ప్రమేయం అధికంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
⇒ ఇదే నియోజకవర్గంలోని మరొక మండ లంలో వెలుగులో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారులు, సిబ్బంది సైతం తన ఇంటికి రావాలని, ఏం జరుగుతుందో వివరాలు చెప్పాలని ఆ మండలంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న టీడీపీ నాయకుడు హుకుం జారీ చేశాడు. ఆ శాఖకు సంబంధించిన సమావేశాలను సైతం తన ఇంటి వద్దే నిర్వహించాలని ఆదేశించాడు. దీంతో సదరు అధికారులు, ఉద్యోగులు భయపడి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే సతీమణి సదరు నాయకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలను ప్రభుత్వ కార్యా లయాల్లోనే నిర్వహించుకోవాలని, అక్కడకే ఎవరైనా వస్తారని సదరు వెలుగు ఉద్యోగులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయినా కూడా కొందరిపై ఆ నాయకుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment