వారోత్సవాలు
భక్తిశ్రద్ధలతో జోగుళాంబ
ప్రముఖుల సందడి..
అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను శుక్రవారం పశుసంవర్దకశాఖ ప్రభుత్వ కార్యదర్శి అమయ్‌కుమార్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీఐ రాజేశ్వరి, ఏఈ కిశోర్‌కుమార్‌రెడ్డి , హైదరాబాద్ బడంగ్‌పేట మేయర్ పారిజాతారెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి, హైదరాబాద్ విజిలెన్స్ సీఐ వెంకటరంగారెడ్డి, దేవాదా యశాఖ జ్యువెలరీ వెరిఫికేషన్ అధికా రి అంజలాదేవి తదితరులు దర్శించుకున్నారు.
జోగుళాంబ శక్తిపీఠం: అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం వారోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం యాగశాలలో భక్తులతో సామూహిక చండీహోమాలు చేయించారు. అలాగే మధ్యాహ్నం త్రిశతి, ఖడ్గమాల అర్చనలు చేశారు. పలువురు భక్తులు సంతాన భాగ్యం కోసం స్వామివారి ఆలయం దగ్గర రేణుకాదేవికి శ్రీ సూక్త సహితంగా అమ్మవారికి అభిషేకాలు చేసి నవనీత నైవేద్యం సమర్పించారు. కుంకుమార్చన మండపంలో దర్బార్ సేవలు చేశారు. బాలబ్రహ్మేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాలు చేశారు. కార్తీక మాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.
కనులపండువగా రథోత్సవం..
వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం జోగుళాంబ అమ్మవారి ఆలయంలో రథోత్సవం నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని ప్రాకార మండపంలో ఊరేగించారు. అలాగే అమ్మవారికి దశవిధ హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు..
దేవస్థానం ఆవరణలో అన్నమాచార్య ప్రాజెక్టు వారు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. అలాగే హైదరాబాద్ మణికొండ ఉమాకాశీనాథ ఆలయం నుంచి వచ్చిన భక్తులు లలిత, విష్ణు సహస్రనామ పారాయణాలు పఠించారు. దేవస్థానం వారు వచ్చిన భక్తులకు బ్రహ్మేశ్వర నిత్యాన్నదాన సత్రంలో భోజన సదుపాయం కల్పించారు. సమీపంలోని సంగమేశ్వర, పాపనాశిని, నవబ్రహ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment