గన్నీసంచుల గోదాంలో అగ్నిప్రమాదం
● షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు ● రూ.25 లక్షల ఆస్తినష్టం
బెల్లంపల్లి: పట్టణంలోని కాల్‌టెక్స్ ఏరియాలో ఉన్న గన్నీ సంచుల గోదాంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్షర ఎంటర్ ప్రైజెస్ పేరుతో నరేంద్రుల శ్రీధర్ కొంతకాలంగా గన్నీ సంచుల గోదాం నిర్వహిస్తున్నారు. రోజువారీగా కూలీలతో సంచులు కుట్టించి అవసరాలకు అనుగుణంగా ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం పంటల సీజన్ కావడంతో సామగ్రి తీసుకువచ్చి నిల్వ ఉంచాడు. మిర్చి రైతులు ఆర్డర్ ఇవ్వడంతో సంచులు కుట్టించి గోదాంలో సిద్ధంగా ఉంచాడు. శుక్రవారం తెల్లవారు జామున గోదాంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో దాదాపు 30 వేల గన్నీ సంచులు కాలిపోయాయి. ఘటనలో రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. కాగా ఘటన సమయంలో గోదాంలో నిద్రించిన కూలీలు నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆరుబయట ఉంచిన దాదాపు 100 వరకు గన్నీ సంచుల బ్యాండిల్స్‌కు మంటలు అంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు.
భయాందోళనలో కాలనీవాసులు
గన్నీ సంచుల గోదాంలో మంటలు చెలరేగడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. మంటలు గోదాంకు ముందున్న అంతర్గత రోడ్డు దాటి వ్యాపించినట్లయితే భారీ నష్టం జరిగి ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. స్థానికులు మంటలు వ్యాపించకుండా నీళ్లు చల్లి అదుపులోకి తెచ్చారు. విద్యుత్ అధికారులకు సమాచారం అందించి కరెంట్ సరఫరా నిలిపివేయించారు. ఈ సంఘటన కాల్ టెక్స్ ఏరియాలో తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. బెల్లంపల్లి అగ్ని మాపక అధికారి ఆర్.సత్యనారాయణ, టూటౌన్ ఎస్సై మహేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత, పలువురు కౌన్సిలర్లు గోదాంను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment