పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: పీఆర్టీయూ
మెదక్ కలెక్టరేట్: పీఆర్టీయూటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం కలెక్టరేట్‌లో సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పీఆర్టీయూటీఎస్ సంఘం ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు త్వరగా విడుదల చేయాలని, సమగ్ర ఉద్యోగుల సమ్మె విరమింప చేయడానికి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుంకరి కృష్ణ, గౌరవ అధ్యక్షుడు దుర్గయ్య, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధర్‌శర్మ, నాయకులు శ్రీనివాస్, మల్లారెడ్డి, వెంకట్రామిరెడ్డి, నాగరాజు, వీరేందర్, అమీరొద్దీన్, హరిబాబు, చంద్రశేఖర్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీరుల యుద్ధ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
గజ్వేల్: మహర్ వీరుల యుద్ధ స్ఫూర్తితో బహుజనులు ముందుకు సాగాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి పిలుపునిచ్చారు. బుధవారం ప్రజ్ఞాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీమ్ కోరేగావ్ మహర్ వీరుల యుద్ధ స్ఫూర్తి దినం సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏగొండస్వామి మాట్లాడుతూ కులతత్వానికి వ్యతిరేకంగా మహర్ సైనికులు 1818 జనవరి 1న పీష్వా సైన్యంతో పోరాడి విజయం సాధించిన రోజును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శౌర్య దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు చంద్రం, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
చేర్యాల(సిద్దిపేట): గురుకులాల్లో 2025–26 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశంతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తుకు ఫిబ్రవరి 1 ఆఖరు తేదీ అని జిల్లా సమన్వయ అధికారి లింగాల పుల్లయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలవారు బోనఫైడ్, కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న ఉంటుందన్నారు.
సోమశంకర్‌కు శౌర్య పతకం
పటాన్‌చెరుటౌన్: పటాన్‌చెరు అగ్నిమాపక కా ర్యాలయంలో డ్రైవర్ గా పనిచేస్తున్న సోమశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక సేవల శౌర్య పతకానికి ఎంపికయ్యారు. రామచంద్రపురానికి చెందిన సోమశంకర్ 2008లో అగ్నిమాపక డ్రైవర్‌గా విధుల్లో చేరారు. గతేడాది నర్సాపూర్ పరిధిలోని చందాపూర్‌లోని ఎస్.బీ ఆర్గానిక్ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదంలో విధి నిర్వహణలో చేసిన సేవలకు గాను ఈ శౌర్య పతకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈయనను ఎంపిక చేసింది. 2017లో ప్రశంసా పత్రం, అదేవిధంగా నగదు ప్రోత్సాహకాన్ని కూడా సోమశంకర్ అందుకున్నారు.
భారీగా నకిలీ మందుల పట్టివేత
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం పారిశ్రామిక వాడలోని ఆక్రన్ పరిశ్రమలో నకిలీ మందులను నార్కోటిక్ అధికారులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ అధికారులు పరిశ్రమలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రముఖ పరిశ్రమలకు చెందిన దాదాపు రూ.2కోట్ల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.
12మంది పోలీసులకుసేవా పతకాలు
సంగారెడ్డి జోన్: జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి బుధవారం పతకాల జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలలో జిల్లా నుంచి 12మంది పోలీసులకు దక్కింది. ఉత్తమ సేవా పతకానికి ఒకరు, సేవా పథకాలకు 11 మంది ఎంపికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment