పడిపోయిన టమాటా ధర
25 కిలోల బాక్స్ రూ. 200లకే ● డిసెంబర్‌లో రూ. 1,200 పలికిన ధర ● దిగుబడి పెరగడంతో తగ్గిన రేట్లు ● ఆందోళనలో రైతులు
ధర లేక నష్టపోతున్నాం
గత నెలలో టమాటకు మంచి డిమాండ్ ఉండి. కిలో రూ. 50 నుంచి 60 వరకు పలికింది. దీంతో ఎకరంలో టమాట సాగు చేశా. విత్తనం నుంచి పంట కాపుకు వచ్చే వరకూ పెట్టుబడిగా రూ. 45 వేల వరకు ఖర్చు చేశా. ప్రస్తుతం ధర లేక పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్లో స్వయంగా అమ్ముకుంటున్న గిట్టుబాటు కావడం లేదు.
– గోవింద్ నాయక్,
రైతు, తుల్జారాంపేట, నర్సాపూర్
ఒకే రకం పంట సాగు చేయొద్దు
గిట్టుబాటు ధరకు అనుగుణంగా రైతులు కూరగాయల పంటలు సాగు చేసుకోవాలి. ఒకే రకం పంట సాగు చేయకుండా ఉన్న భూమిలో ఆయా రకాల పంటలు సాగు చేయాలి. ఇలా చేస్తే ఓ పంటకు డిమాండ్ లేకున్నా మరో పంటకు డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది.
– సంధ్యారాణి, వ్యవసాయ డివిజన్ అధికారిణి
ఈ చిత్రంలోని రైతు పేరు హరిగౌడ్. శివ్వంపేట మండలం నవాపేట గ్రామం. గతేడాది నవంబర్ మొదటి వారంలో ఐదెకరాల్లో టమాట సాగు చేపట్టారు. సాగు కోసం ఎకరాకు రూ. 40 నుంచి రూ. 45 వేల చొప్పున ఐదెకరాలకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. నెల రోజుల తర్వాత దిగుబడి రావడం ప్రారంభమైంది. డిసెంబర్‌లో 25 కిలోల బాక్స్ రూ. 1,000 నుంచి రూ. 1,250 ఉండగా, ప్రస్తుతం రూ. 200 నుంచి రూ. 250 పలుకుతోంది. కూలీ సైతం గిట్టుబాటు కాకపోవడంతో రెండెకరాల్లో పంటను ధ్వంసం చేసి వరి సాగు కోసం సిద్ధమయ్యాడు. మిగితా మూడెకరాల్లో టమాటను తెంపకుండా పొలంలోనే వదిలేశాడు.
నర్సాపూర్ రూరల్: మొన్నటి వరకు కాసులు కురుపించిన టమాట.. ఇప్పుడు రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. పంట చేతికి వచ్చే సమయంలో ధరలు తగ్గడంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశాలు లేక తలలు పట్టుకుంటున్నారు. టమాట కిలో రైతు మార్కెట్‌లో రూ. 15 నుంచి రూ. 20 పలుకుతుండగా.. వ్యాపారులు మాత్రం రైతులకు కిలోకు రూ. 5 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తున్నారు. నర్సాపూర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని రైతులు సుమారు 450 ఎకరాల్లో టమాట సాగు చేశారు. గతేడాది డిసెంబర్‌లో కిలో టమాటా రూ. 50 నుంచి రూ. 60 పలకడంతో చాలా మంది రైతులు తమ బోరు బావుల కింద సాగు చేశారు.
మార్కెట్‌లో పరిస్థితి ఇలా..
ప్రస్తుతం నర్సాపూర్ డివిజన్ కేంద్రంతో పాటు పలు మార్కెట్‌లలో టమాట పంట ఎక్కువగా వస్తుండడంతో ధర భారీగా తగ్గింది. రైతులు టమాటతో పాటు ఇతర కూరగాయలను ప్రతిరోజూ ఉదయం వాహనాల్లో నర్సాపూర్‌తో పాటు పలు మార్కెట్‌లలోని బీటీకి తరలిస్తారు. రైతులు తీసుకెళ్లిన కూరగాయలను ఏజెంట్లు, దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు. మధ్య దళారులు, కమీషన్ ఏజెంట్లు ధరను పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
చేనులో వదిలేసిన టమాట పంటను చూపుతున్న రైతు
Comments
Please login to add a commentAdd a comment