భవిష్యత్ చిరు ధాన్యాలదే..
వడ్డిలో ప్రారంభమైన జాతర
● వివిధ గ్రామాల నుంచి డీడీఎస్ మహిళలు రాక ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● హాజరైన ఐసీఏఆర్ డైరెక్టర్ మీరా, డాక్టర్ ప్రసాద్‌రావు
న్యాల్‌కల్ (జహీరాబాద్): మండల పరిధిలోని వడ్డి గ్రామంలో మంగళవారం నిర్వహించిన 25వ పాత పంటల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రిసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రసాద్‌రావు, శాస్త్రవేత్త విజయ్ కుమార్, ‘సాక్షి’దిన పత్రిక సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు, హైకోర్టు అడ్వొకేట్ రవికుమార్, ఆయా శాఖల అధికారులు, నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ... పాత పంటలకు మంచి రోజులు రానున్నాయని, ప్రస్తుతం ప్రపంచస్థాయిలో 135 బిలియన్ డాలర్ల చిరు ధాన్యాల వ్యాపారం కొనసాగుతోందని అన్నారు. రాబోయే ఆరేళ్లలో చిరుధాన్యాలు135 బిలియన్ డాలర్ల నుంచి 300 బిలియన్ల డాలర్ల బిజినెస్‌కు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 44లక్షల హెక్టార్లలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం జరుగుతుందని తెలిపారు. జహీరాబాద్ మిల్లెట్ బ్రాండ్‌గా గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడదామని పిలుపునిచ్చారు.
మరో ప్రాసెసింగ్ యూనిట్‌కు హామీ...
జహీరాబాద్ ప్రాంతంలోని మాచ్‌నూర్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఉందని, మరో యూనిట్‌ను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని మీరా వెల్లడించారు. డాక్టర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ... పాత పంటలైన చిరు ధాన్యాలను తినడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. పాత పంటలు కనుమరుగవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రసాద్‌రావు మాట్లాడుతూ...ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో పోషకాలు కలిగిన పాత పంటలను ఆహారంగా తీసుకోవాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పంతంగి రాంబాబు మాట్లాడుతూ..మన ఆరోగ్యంతోపాటు పశువులు, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని, అది కేవలం పాత పంటల వల్లే సాధ్యమవుతుందన్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేకుండా పాత పంటలను పండించడం వల్ల అటు నేలకు ఇటు పశువులకు, మనకు మంచి పోషకాలు అందుతున్నాయని తెలిపారు. అంతకుముందు పాత పంటల ధాన్యంతో కూడిన ఎడ్ల బండ్లను వీధుల్లో ఊరేగించారు. పాత పంటల సాగులో ప్రత్యేక చొరవ చూపిన మహిళలు వడ్డి గ్రామానికి చెందిన శోభమ్మ, ఎల్గోయి గ్రామానికి చెందిన నర్సమ్మ, అనుషమ్మ, కాశీంపూర్‌కు చెందిన లచ్చమ్మ, పొట్‌పల్లికి చెందిన రత్నమ్మలను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. పాత పంటలతో తయారు చేసిన వంటకాలను విక్రయించారు. స్థానిక పాఠశాలలో పాత పంటలతో కూడిన పంటకాలను ముఖ్య అతిథులు, అధికారులు, నాయకులు రుచి చూశారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మెన్ తిరుపతిరెడ్డి, జహీరాబాద్ రూరల్ సీఐ జెక్కుల హన్మంత్, సామాజిక కార్యకర్త ఉషా సీతాలక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రాజశేఖర్, డీడీఎస్ కో–ఆర్డినేటర్ పూలమ్మ, జాయింట్ డైరెక్టర్ గిరిధర్‌బాబు రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment