నిధులు రాలె.. పనులు కాలె
ప్రగతిలో వెనుకబడిన మున్సిపాలిటీలు ● ఈనెల 26తో ముగుస్తున్న పాలకవర్గాల గడువు
జిల్లాలోని పలు మున్సిపాలిటీలు నిధులు కొరతతో ప్రగతిలో వెనుకబడ్డాయి. మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ పాలకవర్గాల గడువు ఈనెల 26తో ముగుస్తుండటంతో వారి పదవీ కాలంలో చేపట్టిన పనులు, ఇబ్బందులపై ఆయా మున్సిపాలిటీల చైర్మన్లతో ‘సాక్షి’ ముఖాముఖి..
నర్సాపూర్: ఆయా పథకాల కింద ప్రభుత్వం నుంచి రూ. 55 కోట్ల నిధులు మంజూరైనా సకాలంలో విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏడాది పదవీ కాలంలో అనుకున్న పనులు చేపట్టలేకపోయామని మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలను వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ పదవికి 2023 డిసెంబర్‌లో మురళీయాదవ్ రాజీనామా చేయగా, గతేడాది జనవరి 27న బాధ్యతలు చేపట్టా. వార్డుల్లో సుమారు రూ. మూడున్నర కోట్లతో సీసీ రోడ్లు నిర్మించా. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయానికి కొత్త భవనం, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు, దోబీఘాట్ సుమారు రూ.10 కోట్లతో నిర్మించినా సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో మూడు భవనాలు అసంపూర్తిగానే మిగిలాయి. రాయరావు చెరువు సుందరీకరణతో పాటు బోటింగ్ సదుపాయం, పట్టణంలోని జాతీయ రహదారిపై డివైడర్లు, స్టేడియం నిర్మాణంతో పాటు పట్టణంలోని పలు ప్రధాన మార్గాలలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయనందున గుంతల రోడ్లపైనే ప్రజలు తిరగాల్సి వస్తుంది. పలు భవనాల నిర్మాణం చేపట్టినా నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. పట్టణంలో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించినా నిధులు రాకపోవడంతో చేపట్టలేకపోయాం. – అశోక్‌గౌడ్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్
రామాయంపేట(మెదక్): ఈ ఐదేళ్ల కాలంలో నిధుల కొరతతో తాను అనుకున్న అభివృద్ధి పనులు చేయలేకపోయానని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పలు అంశాలను వెల్లడించారు. పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో చైర్మన్‌గా ఎన్నికై విఫలమయ్యా. ఐదేళ్ల పదవీకాలం తనకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. తాను ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చలేకపోయా. తన హయాంలో సుమారు రూ. 15 కోట్ల మేర మాత్రమే అభివృద్ధి పనులు చేశా. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయా. పట్టణంలో గత 30 ఏళ్ల క్రితం నిర్మించిన రహదారులు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రధానంగా పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వెజ్, నాజ్ వెజ్ మార్కెట్ నిర్మాణం, మినీట్యాంక్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించలేకపోయా. నమ్మిన ప్రజలకు న్యాయం చేయలేకపోయా. ఈ ఐదేళ్ల పాలన తనకు ఎంతమాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కొంత మేర సహకారం ఇచ్చాయి. మున్సిపాలిటీ అభివృద్ధి విషయమై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయాలి. – జితేందర్‌గౌడ్, రామాయంపేట మున్సిపల్ చైర్మన్
ఏ మాత్రం సంతృప్తిగా లేను
అసంపూర్తి పనులే మిగిలాయి
Comments
Please login to add a commentAdd a comment