నిర్వహణ లేక.. నిరుపయోగం
ప్రశ్నార్థకంగా ఎరువుల తయారీ..
తడి పొడిచెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ, వర్మికంపోస్టు ఎరువు తయారీ కార్యక్రమం మొదటి సంవత్సరం వరకు సజావుగా సాగింది. అనంతరం చెత్త సేకరణ పూర్తిగా నిలిచి పోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారడంతో తడి పొడిచెత్తతో వర్మికంపోస్టు ఎరువుల తయారీ ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని జీపీ కార్మికులకు సక్రమంగా వేతనాలు అందక పోవడంతో కార్మికులు మొక్కుబడిగా సేకరించిన చెత్తను వేరు చేసే ప్రక్రియను చేపట్టకుండా ఎక్కడిక్కడే కాల్చివేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం మూణ్ణాళ్ల ముచ్చటకే పరిమితమైంది.
ప్రత్యేక రిజిస్టర్ సమాచారం..
కార్యక్రమం ప్రారంభంలో రోజువారీగా ఎన్ని ట్రిప్పుల చెత్తను సేకరించారనే సమాచారాన్ని ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని, సెగ్రిగేషన్ షెడ్‌కు తరలించిన చెత్త నుంచి తడి పొడిచెత్తను వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిట్స్‌లో వర్మికంపోస్టు తయారీ చేయాలని నిబంధనలు విధించారు. చెత్త నుంచి వేరుచేసిన ప్లాస్టిక్, ఐరన్, గాజు వస్తువులు, సీసాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాలని, తయారైన వర్మికంపోస్టు ఎరువును అవసరమైన రైతులకు విక్రయించాలని లేదంటే హరితహారం, పల్లెప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు ఎరువుగా వినియోగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ అలా జరగడం లేదు. మండల, జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్యక్రమ నిర్వహణ అటకెక్కింది.
నిమ్మగూడెంలో నిరుపయోగంగా ఉన్న సెగ్రిగేషన్ షెడ్డు
మంగపేట: జిల్లాలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కడపడితే అక్కడ చెత్తను డంప్ చేసి తగలబెడుతున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. 2019లో అప్పటి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ పల్లెను పారిశుద్ధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా 2020లో గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఒక్కో సెగ్రిగేషన్ షె డ్‌కు రూ.2.50 లక్షల నిధులను కేటాయించి జిల్లాలోని 174 జీపీల్లో 174 షెడ్స్‌ను నిర్మించారు. రోజు వారీగా తడి పొడిచెత్తను సేకరించేందుకు ప్రతీ ఇంటికి రెండు ప్లాస్టిక్ టబ్‌లను అందించారు. చెత్తను తరలించేందుకు గ్రామపంచాయతీకి ఒకటి చొ ప్పున ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. పలు మేజర్ గ్రామ పంచాయతీలకు రెండు చొప్పున కొనుగోలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.
చెత్తను కాల్చేస్తున్నారు..
నాలుగేళ్లుగా జిల్లా వ్యాప్తంగా తడి పొడిచెత్త వేరు చేయడం పూర్తిగా నిలిచిపోయింది. మొక్కుబడిగా గ్రామాల్లో మొత్తం చెత్తను ఒకే దాంట్లో వేసి పంచాయతీ ట్రాక్టర్లతో తరలిస్తూ ఎక్కడబడితే అక్కడ డంపింగ్ చేసి తగల బెడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బరించలేని దుర్వాసన వెదజల్లు తుండటంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. సెగ్రిగేషన్ షెడ్స్ నిర్వహణ, చెత్త సేకరణ రిజిస్టర్లు లేకపోయినప్పటికీ చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహణకు కూలీలు, ట్రాక్టర్‌లో డీజిల్, మరమ్మతు పేరుతో సంవత్సరానికి లక్షల్లో ఖర్చు చేసినట్లు రికార్డుల్లో ఉండటం గమనార్హం. ప్రజలకు జవాబు దారిగా పనిచేయాల్సిన కొందరు జిల్లా స్థాయి అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు నేనే రాజు నేనే మంత్రి అనే చందంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క స్పందించి సెగ్రిగేషన్ షెడ్లు వినియోగంలోకి తెప్పించి, పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
రాజుపేటలో సెగ్రిగేషన్ షెడ్డు సమీపంలో
కాలుతున్న చెత్త
Comments
Please login to add a commentAdd a comment