హత్యలు.. హత్యాయత్నం కేసులు అధికం
దొంగతనాలు రెట్టింపు
చోరీ సొత్తు రికవరీలో పోలీసుల వెనుకబాటు
రోడ్డు ప్రమాదాలకు నిలయంగా రహదారులు
ఏడాది కాలంలో 184 మంది మృత్యువాత
మహిళలపై తగ్గిన వేధింపులు.. కిడ్నాప్ కేసులు
నాగర్‌కర్నూల్ క్రైం: ఈ ఏడాది జిల్లాలో శాంతిభద్రతలు మరింత మెరుగు పడినప్పటికీ.. నేరాల సంఖ్య మాత్రం తగ్గలేదు. వివాహేతర సంబంధాలు, ఆస్తి కోసం హత్యలకు పాల్పడటం అందరినీ కలిచివేసింది. ఈ ఏడాది పోలీసులకు మొత్తం 7,909 ఫిర్యాదులు అందగా.. 4,007 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైం, షీ టీం కేసులు, చోరీలు, హత్యలు, చీటింగ్, గేమింగ్, ఎస్సీ, ఎస్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, హత్యాయత్నం కేసులు పెరిగినప్పటికీ.. మహిళలపై వేధింపులు, రేప్ కేసులు, కిడ్నాప్ కేసులు, ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి.
పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ నిర్మూలన కోసం అవసరమైన చర్యలు చేపట్టారు. మహిళలపై వేధింపులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యహరించారు. వరదల సమయంలో వాగులు, నదుల్లో చిక్కుకున్న చాలా మందిని రెస్క్యూ చేసి కాపాడారు.
ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా 39 మంది చిన్నారులను రక్షించారు. 570 కేసుల్లో 32 మందికి జైలుశిక్ష పడేలా చేశారు. 7 డ్రగ్స్ కేసులు నమోదు చేసి.. 12 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 309 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ విలేకరులకు వెల్లడించారు.
385 రోడ్డు ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 385 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా.. 184 మంది మృతి చెందారు. మరో 420 మంది గాయాలపాలయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరిగినప్పటికీ మృతుల సంఖ్య తగ్గింది.
వివిధ కారణాలతో 33 హత్యలు..
జిల్లాలో హత్యలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది 33 హత్య కేసులు నమోదయ్యాయి. అందులో 13 కుటుంబ కలహాలతో, 11 వివాహేతర సంబంధానికి సంబంధించి, 6 ఆస్తి తగాదాలు, 5 ఆస్తి కోసం, 3 ఇతర కారణాలతో హత్యలు చోటు చేసుకున్నాయి.
రోడ్డు నిబంధనలు కఠినంగా అమలు..
రోడ్డు నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. మోటారు వెహికిల్ యాక్ట్ కింద 82,957 కేసులు నమోదు చేసి.. రూ. 3,45,29,845 జరిమానా విధించారు. ఇక డ్రంకెన్ డ్రైవ్ కింద 3,294 కేసులను నమోదు చేసి.. రూ. 26,72,131 జరిమానాలు విధించారు. తాగి వాహనాలు నడిపిన 34 మందికి జైలుశిక్ష పడేలా చేశారు.
● జిల్లాలో గేమింగ్ యాక్ట్‌కు సంబంధించి 32 కేసులు నమోదు చేసి.. రూ. 7,66,930 నగదును సీజ్ చేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా 138 నగదు సీజ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ. 1,37,32,355 నగదును సీజ్ చేశారు. 181 లిక్కర్ కేసులు నమోదు చేసి.. 2,418 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1,641 సెల్‌ఫోన్లు చోరీలకు గురికాగా.. 1,000 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. షీ టీంకు 166 ఫిర్యాదులు రాగా.. 59 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 22 పెట్టి కేసులు నమోదు చేశారు. 80 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 251 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
రూ. కోట్లు కొల్లగొట్టిన ఘనులు
జిల్లావ్యాప్తంగా సైబర్, ఆర్థిక నేరాలు పెరిగిపోయాయి. సైబర్ క్రైం పోలీసులు తక్షణమే స్పందించి బాధితుల సొమ్ము రూ. 10.08 లక్షలు రికవరీ చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 70 కేసులు నమోదు కాగా.. నేరగాళ్లు రూ. 30,46,74,751 సొత్తును కొల్లగొట్టారు.
● చోరీలకు సంబంధించి 277 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా రూ. 3,72,80,815 సొత్తు చోరీకి గురికాగా.. ఇప్పటి వరకు రూ. 99,54,300 సొమ్మును పోలీసులు రికవరీ చేశారు.
● గతేడాది కంటే ఈ ఏడాది మహిళలపై వేధింపులు, కిడ్నాప్ కేసులు తగ్గాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి 418, రేప్ కేసులు 107, కిడ్నాప్ కేసులు 28 నమోదయ్యాయి.
నమోదైన కేసులు వివరాలు; 2023; 2024
అందిన ఫిర్యాదులు; 8,524; 7,909
నమోదైన కేసులు; 4,108; 4,007
హత్యలు; 31; 33
ఆస్తికోసం హత్యలు; 4; 5
అత్యాచారాలు; 80; 107
కిడ్నాప్ కేసులు; 40; 28
రోడ్డు ప్రమాదాలు; 367; 385
మృతులు; 191; 184
ఎస్సీ ఎస్టీ కేసులు; 53; 84
మహిళలపై వేధింపులు; 410; 418
ఆత్మహత్యలు; 191; 182
Comments
Please login to add a commentAdd a comment