వ్యవసాయ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ ఉద్యోగుల సంఘానికి అనుబంధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఏర్పాటైంది. ఏపీజీఈఏ జిల్లా శాఖ అధ్యక్షుడు బంగి శ్రీధర్, రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం నేతలు రఘురామ నాయుడు, డీ.శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై ఎన్నిక కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సంఘంలో ఆఫీసు సబార్టినేట్ నుంచి పరిపాలన అధికారి వరకు అన్ని కేటగిరి ఉద్యోగులు ఉంటారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఎం.శ్రీహరి(నంద్యాల జిల్లా), కార్యదర్శిగా హెచ్.రూపేష్‌కుమార్ (కర్నూలు జిల్లా), సహా అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్, కోశాధికారిగా సాయికుమార్, ఉపాధ్యక్షులుగా సునీల్‌కుమార్, ఎండీ ఆలీ, దివాకర్, సంయుక్త కార్యదర్శులుగా జయరాజు, పి.కిశోర్, శివకమార్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజేష్, అలేఖ్య, జిల్లా ఈసీ మెంబర్లుగా జయరాములు, సాంబశివుడు, రాష్ట్ర ఈసీ మెంబరుగా విజయకుమార్ ఎన్నికయ్యారు. తర్వాత వీరు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి 2025 టేబుల్ క్యాలండర్ విడుదల చేశారు.
డీసీసీబీ సీఈవోగా
వెంకటేశ్వరస్వామి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఎం.వెంకటేశ్వరస్వామి ఎంపికయ్యారు. ఈయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్‌గా పని చేసి ఏడాది క్రితం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. కర్నూలు డీసీసీబీతో పాటు వివిధ డీసీసీబీల సీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో కొన్ని నెలల క్రితం ఆప్కాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా వెంకటేశ్వరస్వామి సీఈవో పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఈయన ఎంపికయ్యారు. కొందరు పేర్లను డీసీసీబీ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ అయిన జేసీ నవ్యకు పంపారు. మంగళవారం కలెక్టరేట్‌లో జేసీతో ఆప్కాబ్ ప్రతినిధి కొండలరావు, ఎఫ్‌ఏసీతో సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయకుమార్ సమావేశమై సీఈవో ఎంపికపై చర్చించారు. ఇందులో ఎం.వెంకటేశ్వరస్వామిని సీఈవోగా ఎంపిక చేస్తూ జేసీ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు ఏడాది నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు ఎట్టకేలకు రెగ్యులర్ సీఈవోను ఎంపిక చేశారు.
4న లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు
కర్నూలు(అర్బన్): ఈ నెల 4వ తేది ఉదయం 11 గంటలకు నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జయంతి రోజున ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బ్యాంకు ఉద్యోగులైన అంధులకు ఓడీ సౌకర్యం కల్పించామన్నారు. ఈ నేపథ్యంలోనే అంధ ఉద్యోగులు తమ అధికారులకు తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు.
విద్యార్థులు
ప్రణాళికతో చదవాలి
పాణ్యం: విద్యార్థులు ఒక ప్రణాళికతో చదవాలని నంద్యాల డీఈఓ జనార్దన్‌రెడ్డి సూచించారు. మంగళవారం సుగాలిమెట్ట వద్ద ఉన్న కస్తూరిబాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలన్నారు. అలాగే సమయానికి పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. ముఖ్యంగా పరీక్షలు అంటే భయం వీడాలన్నారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న ఆహారం,చదువుపై ఆరా తీశారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment