ఆనాటి జ్ఞాపకాలు మధురం
ఆత్మకూరు: విద్యార్థి దశలోని జ్ఞాపకాలు, ముచ్చట్లు ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతులు అని ఆత్మకూరు ప్రభుత్వం జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు రిటైర్డ్ ఇస్రో శాస్త్రవేత్త మృత్యుంజయరెడ్డి, విక్రమసింహా యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ విజయభాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ బ్యాంక్ అధికారి మునీశ్వరయ్య అన్నారు. ఆదివారం కళాశాల స్వర్ణోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. తాము వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇక్కడి గురువులే బోధనలే దోహదపడ్డాయన్నారు. ఈ కాలేజీ వాతావరణం తమను లక్ష్యం వైపు నడిపించిందని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఎల్‌ఐసీ మేనేజర్ పాండురంగనాయక్, కర్నూలు ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల డాక్టర్ రఫిక్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సాయిసుధీర్, విశ్వనాథం, కేవీ స్వాములు మాట్లాడుతూ ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకున్నామన్నారు. ప్రస్తుత విద్యార్థులు కూడా క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. స్నేహితులుగా ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకోవాలన్నారు. మంచి విద్యాబుద్ధులు నేర్పించిన ఈకాలేజీని ఎప్పటికీ మరువమన్నారు. అలాగే ఇక్కడ చదివే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.జూనియర్ కళాశాల స్థల దాత వెన్న రామకృష్ణారెడ్డి తనయుడు భోగిరెడ్డి మాట్లాడుతూ కరువు, కాటకాలకు నిలయమైన ఆత్మకూరులో కళాశాల ఏర్పాటుకు తన తండ్రి ఎంతో శ్రమించారన్నారు. ఆనాడు ఊరూరా తిరిగి చందాలు వసూలు చేసి కాలేజీ ఏర్పాటుకు లక్షరూపాయల డిపాజిట్ చేశారన్నారు. నేడు ఇక్కడ ఎంతో మంది చదువుకొని ఉన్నతంగా ఎదగడం చూస్తే సంతోషంగా ఉందన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ రఘురామాచార్యులు దంపతులను, 19974 నుంచి 2010 వరకు చదివిన పూర్వ విద్యార్థులను బ్యాచ్‌ల వారీగా సన్మానించారు. అంతకు ముందు స్థల దాత వెన్న రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రఘురామాచార్యులు, అధ్యాపకులు సలీం, సుజాత, మనోహర్, షేక్షావలి, సలీం, షేక్షావలి, రవికుమార్, బ్రహ్మానందం, శివలక్ష్మిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్వర్ణోత్సవ వేడుకల్లో పూర్వ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment