చదువు భారం అ‘ధనం’
కర్నూలు సిటీ: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందు కు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రణాళికను విద్యాశాఖ తయారు చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా సబ్జెక్టు నిపుణులతో తయారు చేయించిన స్టడీ మెటీరియల్‌ను అందజేయాల్సి ఉంది. అయితే ఇంత వరకు ఆ వైపుగా చర్యలు చేపట్టలేదు. స్టడీ మెటీరియల్ ఇచ్చేందుకు తమ దగ్గర నిధులు లేవు అంటూ విద్యార్థులపైనే భారం వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఏపీ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఎయిడెడ్, ప్రభుత్వ హైస్కూల్స్ మొత్తం 560 ఉన్నాయి. ఈ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు 35,014 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి ఏటా జిల్లా సాధారణ పరీక్షల విభాగం నుంచి స్టడీ మెటీరియల్ ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది నిధులు లేవని, రాష్ట్ర విద్యాశాఖ తయారు చేసిన క్వశ్చన్ బ్యాంకు, మోడల్ ప్రశ్నపత్రాలతో కూడిన బుక్‌లెట్లను పీడీఎఫ్ ఫైల్ రూపంలో వచ్చినవి అలాగే స్కూళ్లకు పంపించారు. విద్యార్థులనే ప్రింట్ తీసుకుని చదువుకోవాలని సూచనలు చేయనున్నారు. లాంగ్వేజెస్ బుక్‌లెట్ 198, నాన్ లాంగ్వేజెస్ 218 పేజీలు ఉంది. ఈ రెండింటిని ప్రింట్ తీసుకోవాలంటే ఒక్కో పేపరుకు కనీసం రూ.2 చొప్పున తీసుకుంటారు. దీని వలన విద్యార్థులపై స్టడీ మెటీరియల్ భారం రూ.2.91 కోట్లకుపైగానే ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
పరీక్షల నిర్వహణ ఇలా..
2020లో ఆరో తరగతిలో ఉన్న విద్యార్థులు ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలు ఇంగ్లిషు మీడియంతో పాటు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలను మాత్రం ఎస్‌ఎస్‌సీ నిర్వహిస్తుంది. ఆరు సబ్జెక్టులు, ఏడు పేపర్ల విధానంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. సైన్స్ సబ్జెక్టులో భౌతిక, రసాయన శాస్త్రం ఒకటిగా, జీవ శాస్త్రం ఒకటిగా 50 మార్కుల చొప్పున రెండు పరీక్షలు నిర్వహించున్నారు. మిగిలిన ఐదు సబ్జెక్టులకు సంబంధించి ఐదు పరీక్షలు 100 మార్కులకు ఉంటుంది. వంద మార్కుల విభాగంలో 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్–1లో అబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు 12 ఉంటాయి. వీటిలో ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉండగా.. అన్ని రాయాలి. సెక్షన్–2లో రెండు మార్కుల ప్రశ్నలు ఎనిమిది ఉండగా.. అన్ని రాయాలి. సెక్షన్–3లో ఎనిమిది ప్రశ్నలు ఉండగా.. ఒక్కోదానికి నాలుగు మార్కులు ఉంటాయి. సెక్షన్–4లో ఐదు ప్రశ్నలు.. ఎనిమిది మార్కుల చొప్పున ఉంటాయి. ఈ విభాగంలో మాత్రమే ఒక్కో ప్రశ్నకు ఏ,బీ అని రెండు ప్రశ్నలు ఉండగా.. ఒకటి చాయిస్ ఉంటుంది. మొత్తం 3.15 గంటల సమయం ఇస్తుండగా అన్ని ప్రశ్నలు రాయాలి. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇస్తారు, ఆ తరువాత అడిగితే మరో 12 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు.
అప్పుడిలా.. ఇప్పుడు ఇలా
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితాల పెంపునకు ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలు ఆయా మండలాల ఎంఈఓలపైనే కాకుండా జిల్లా అధికారులకు సైతం అప్పగించింది. విద్యార్థులను ఆయా సబ్జెక్టు టీచర్లకు దత్తత ఇచ్చేలా చర్యలు తీసుకుంది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించింది. అయితే రాష్ట్రంలోని ఉన్న ప్రస్తుత ‘కూటమి’ ప్రభుత్వం అలాంటి చర్యలేవీ చేపట్టలేదు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వకుండా అ‘ధనం’ భారం వేసేందుకు సిద్ధం అయ్యింది.
పదో తరగతి విద్యార్థులకు అందని
స్టడీ మెటీరియల్
పీడీఎఫ్ కాపీ ఇచ్చి ప్రింట్
చేయించుకోవాలంటున్న అధికారులు
విద్యార్థులపై రూ.2.91కోట్ల భారం
ఆరు సబ్జెక్టులు..
ఏడు ప్రశ్నపత్రాలుగా పరీక్షలు
మారిన ప్రశ్నపత్రాలపై సాధన
చేయలేని విద్యార్థులు
పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అయితే సమయం సమీపిస్తున్నా స్పందించడం లేదు. నామమాత్రంగా ప్రత్యేక తరగతులతో కాలయాపన చేస్తోంది. స్టడీ మెటీరియల్ ఇవ్వడంలోనూ ఉత్సాహం చూపడం లేదు. ప్రశ్నపత్రాలు మారడం.. స్టడీ మెటీరియల్ తీసుకోవడానికి అ‘ధన’పు భారం మోపడం..తదితర కారణాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment