సిక్తా పట్నాయక్, కలెక్టర్
సొంతిల్లు ఉన్నా.. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే 66 శాతం పూర్తి
నేటితో ముగియనున్న గడువు
వలస వెళ్లిన వారు సర్వేకు దూరం..
మరికల్: గూడులేని పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసి కమిటీలు వేసి అర్హులను గుర్తిచేందుకు సర్వేను ప్రారంభించింది. కానీ అసలైన లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో కాని డబుల్ అంతస్తులు, రాజకీయపార్టీల నాయకులు ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం సర్వేలో వెలుగు చూడటం విశేషం. సర్వే జరుగుతుండగానే రాజకీయ నాయకులు ఇళ్ల కోసం పైరవీలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే చివరి దశకు చేరుకోవడంతో ధనబలం, రాజకీయ బలం ఉన్న వారు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం అందజేసే రూ.5 లక్షల కోసం కక్కుర్తి పడుతున్నారు. సర్వేకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
కానీ జిల్లా అంతట సర్వే చేస్తున్న సిబ్బంది యాప్‌లో పొందుపర్చే అంశాలకు తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 9 గంటల వరకు 66 శాతం సర్వే పూర్తి చేశారు. మరో 39 శాతం పూర్తి చేసేందుకు ఈ నెల 31 వరకు చివరి గడువు మిగిలి ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో అధికారులు ఇళ్ల దగరకు వెళ్లగా ఆ సమయంలో ఇళ్ల వద్ద లబ్ధిదారులు లేకపోవడం, మరోపక్క వలస వెళ్లిన వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడం వల్ల వారి వివరాల సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోపాటు దరఖాస్తు ఫారంలో ఇంటి కోసం టిక్ వేసిన వారి వివరాలు యాప్‌లో చూపకపోవడం, టిక్ కొట్టన్ని వారివి చూపడంతో సర్వే చేస్తున్న సిబ్బంది తల పట్టుకుంటున్నారు. ఈ కారణాల వల్ల కూడా సర్వే నెమ్మదిగా సాగుతోంది.
వలస వెళ్లిన వారి పరిస్థితి అయోమయం
జిల్లాలో దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి తదితర మండలాల నుంచి బతుకు దెరువు నిమిత్తం ఇతర పట్టణాలకు వలస వెళ్లిన వారు కూడా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలను సేకరించడం కోసం ఇళ్ల వద్దకు సర్వే బృందం వెళ్తుండగా వారి వివరాలు చెప్పేవారు లేక అధికారులు వెనుదిరుగుతున్నారు. ఫోన్ ద్వారా వారికి సమాచారం అందించి సర్వేలో పాల్గొనాల్సిందిగా సూచించాలని, వారి వివరాలు కూడా యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించడంతో ఏంచేయాలో తెలియక అయోమయంలో పడ్డారు.
వందశాతం పూర్తి చేయాలి
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేను అధికారులు వేగవంతం చేయాలి. ఈ నెల 31 వరకు వంద శాతం పూర్తి చేయాలి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించవద్దు. వలస వెళ్లిన వారి వివరాలను సైతం సేకరించి యాప్‌లో నమోదు చేయాలి. – సిక్తా పట్నాయక్, కలెక్టర్
తికమక పెడుతున్న ప్రశ్నలు
సర్వే సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేసుకోవాలి. లబ్ధిదారు పేరు, ఆధార్ ఐడీ, సంవత్సర ఆదాయం, సొంత స్థలం ఉందా, గతంలో ఇల్లు మంజూరైందా.. వంటి 35 ప్రశ్నలకు సర్వే సిబ్బంది సమాధానాలు రాబట్టి నమోదు చేసుకుంటున్నారు. ఒక్కో ఇంటి వద్ద 15 నుంచి 25 నిమిషాల సమయం పడుతోంది. యాప్‌లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి లబ్ధిదారుడి ముఖాన్ని, ఇల్లు నిర్మించుకునే స్థలానికి భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు నమోదు చేయడం, ఇళ్ల నిర్మాణ ప్రగతిని సైతం ఏఐ ఆధారంగా ఫొటోలు తీయడంతో సర్వేకు ఎన్నో ఆటంకాలు ఏర్పడాయి.
గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం రద్దుచేసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చి ప్రజాపాలన నిర్వహించగా ఇళ్లు లేని లబ్ధిదారుల నుంచి జిల్లాలో 1.48 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అర్హులను గుర్తించేందుకు సర్వే చేపట్టగా ఇప్పటివరకు 66శాతం మాత్రమే పూర్తి అయ్యింది. మరో రెండు రోజుల వ్యవధిలో వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ క్షేత్రస్థాయిల్లో సర్వే జరుగుతున్న గ్రామాల్లో పర్యటించి వందశాతం పూర్తి చేసి యాప్‌లో నమోదు చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అధికారులు గ్రామాలకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment