చెరువుల గోసతీరేనా?
● నిర్మల్ చెరువుల్లోకి మురుగునీరు ● పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ మారేనా? ● జలాశయాలు స్వచ్ఛమయ్యేనా? ● మున్సిపాలిటీల్లో ఎస్టీపీల ఏర్పాటు ● మార్పు రావాలని ప్రజల డిమాండ్
నిర్మల్: ఊరి బాగు కోరే తల్లిలాంటి చెరువులను ఊరంతటి మురుగునీటితో నింపేస్తున్నారు. ఓ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో మురుగునీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. జిల్లాలోని మూడు పట్టణాల్లో ఇదే దుస్థితి ఉంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలో చారిత్రక గొలుసుకట్టు చెరువులన్నీ మురికి కూపాలుగా మారిపోయాయి. ఒక దిక్కు కబ్జాలు మింగేస్తుంటే.. మరోదిక్కు ఈ కలుషితనీళ్లు చెరువుల ఉనికినే ప్రశ్నార్థకంగా మా ర్చేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వమే మున్సిపాలిటీల్లో మురుగునీటి వ్యవస్థను మెరుపర్చేదిశగా చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 కింద మున్సిపాలిటీల్లో మురుగునీటిని శుద్ధి చేసేందుకు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు అవసరమైప నిధులనూ కేటాయించింది.
ఎస్టీపీలపై ఆశలు
వందల ఏళ్ల క్రితం తవ్విన గొలుసుకట్టు చెరువులున్నందునే నిర్మల్ పట్టణంలో ఇప్పటికీ ఎప్పుడూ ఒక్కక్షణం కూడా నీటి సమస్య రాలేదు. జిల్లాకేంద్రంలో చాలాచోట్ల 15–20ఫీట్లకే భూగర్భజలాలు వస్తాయంటే అది చెరువుల పుణ్యమే. అలాంటి చెరువులను కబ్జాలతోపాటు కలుషిత నీటితో ఖతం చేస్తున్నారు. తాజాగా కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 ద్వారా మున్సిపాలిటీల్లో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ)ను ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా ప్రధానంగా చెరువుల్లో మురుగునీరు కలిసేచోటే వీటిని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడంతో మురుగునీరు శుద్ధి చేసిన తర్వాతే చెరువుల్లోకి వదలడానికి అవకాశముంటుంది. గతంలో పాలకులు జిల్లాకేంద్రంలో చెరువుల వద్ద ఎస్టీపీల ఏర్పాటుకు హామీలూ ఇచ్చారు. ఖానా పూర్‌లో శాంతినగర్ చెరువులో మురుగునీరు చేరకుండా చూడాలని, వీటితో కాలనీలో జ్వరాలు ప్రబ లుతున్నాయని పలుసార్లు ఆందోళనలూ చేశారు.
జిల్లాకు రూ.36.29 కోట్లు
జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ)లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిధులను మంజూరు చేసింది. నిర్మల్ మున్సి పాలిటీకి రూ.18.86కోట్లు, భైంసాకు రూ.10.36 కోట్లు, ఖానాపూర్ బల్దియాకు రూ.7.06కోట్ల నిధులు మంజూరయ్యాయి. మూడు మున్సిపాలిటీలకు కలిపి రూ.36.29కోట్లు కేటాయించడం గమనార్హం. పబ్లిక్‌హెల్త్ ద్వారా టెండర్లు నిర్వహించి ప్రైవేట్ ఏజెన్సీలతో ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు.
చెరువులను కాపాడాలి
నిర్మల్‌లో నీటికష్టాలు రాకుండా చూస్తున్న గొలుసుకట్టు చెరువులను కాపాడాలి. కేంద్రం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం హర్షణీయం. వీటి ద్వారా చెరువుల్లో మురుగునీరు చేరకుండా ఇప్పటికై నా పక్కాగా చర్యలు చేపట్టాలి.
– దశరథ్ పోశెట్టి, నిర్మల్
మురుగునీరు చేరకుండా..
ఖానాపూర్ పట్టణంలోని చెరువుల్లోకి ము రుగునీరు చేరకుండా చూడాలి. గతంలో చాలాసార్లు వీటిపై ఖానాపూర్‌వాసులమంతా పాలకులు, అధికారులకు విన్నవించాం. ఆందోళనలూ చేశాం. శాశ్వత చర్యలు తీసుకోవాలి.
– లాండేరి రమేశ్, ఖానాపూర్
దారుణ స్థితిలో చెరువులు
ఇంటికో బోరుబావి తవ్వుకున్న తర్వాత చెరువుగోస మొదలైంది. ఒకప్పుడు ఊరంతటికీ తాగునీరు అందించిన చెరువుల వైపు ఎవరూ చూడటం లేదు. ఇప్పటికీ భూగర్భజలాలు, మత్స్యసంపదను అందించే వాటిని కనీసం పట్టించుకునే నాథులేలేరు. నిర్మల్‌లో చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులన్నింటినీ నాశనం చేశారు. చారిత్రక పట్టణంలో ఒకప్పుడు ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఆక్రమణలతో దెబ్బతీశారు. నాళాలను ఆక్రమించి, మురుగునీటిని చెరువుల్లోకి వదిలిపెడుతున్నారు. అయినా అధికారు లు పట్టించుకోవడంలేదు. ధర్మసాగర్, కంచెరోని చెరువు, చిన్నరాంసాగర్, ఖజనా చెరువు ఇలా.. అన్నీ మురుగునీటితో దుర్గంధభరితమయ్యాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలోని శాంతినగర్‌లోగల బుడ్డోనికుంట చెరువు, విద్యానగర్‌లోని కప్పలకుంట చెరువులోకి డ్రైనేజీ నీటిని వదిలేస్తున్నారు. ఇక భైంసాలో మురుగునీరు మొత్తం సుద్దవాగులో కలిసిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment