ప్రారంభమైన శబరిమాత ఉత్సవాలు
తాడ్వాయి: మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో ఆదివారం 54వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు సుప్రభాత ధ్యానం, గురుగీత, గురుచరిత పారాయణం, గోమాత, ధ్వజారోహణ తదితర కార్యక్రమాలను ఆశ్రమ నిర్వాహకులు చేపట్టారు. ఆయా జిల్లాల నుంచి 300మంది భక్తులు ఆశ్రమానికి కాలినడకన వచ్చారు. ఉదయం ఆశ్రమం నుంచి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలో ఊరేగింపు చేపట్టి భిక్షాటన చేశారు. మధ్యాహ్నం 12గంటలకు ఆశ్రమంలో వేద పండితులు శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహాత్ములు తమ సందేశాన్ని ఇచ్చారు. శ్రీ సీతారామాంజనేయ సంవాద మహాగ్రంథ పారాయణం, శ్రీగురుగీత, గురచరిత పారాయణం తదితర కార్యక్రమాలను చేపట్టారు. సాయంత్రం దత్తాత్రేయ జయంతి సందర్భంగా డోలారోహణ కార్యక్రమం, రాత్రి ప్రధాన రహదారిపై రథోత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారు జాము వరకు భజన, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపదగేయాలు, నృత్యాలు తదితర కార్యక్రమాలను చేపట్టారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆర్టీసీ అధికారులు ఆశ్రమం వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా అరకిలోమీటరు పొడవునా రకరకాల దుకాణాలు వెలిశాయి. సీఐ సంతోష్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు, గాంధారి ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులు, ఆశ్రమ కమిటీ నిర్వాహకులు, సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కనుల పండువగా
వేంకటేశ్వర స్వామి కల్యాణం
తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment