బాల్కొండలో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బాల్కొండలో అగ్ని ప్రమాదం

Published Tue, Dec 31 2024 1:33 AM | Last Updated on Tue, Dec 31 2024 1:33 AM

బాల్క

బాల్కొండలో అగ్ని ప్రమాదం

బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని నడిమిగల్లిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. కాలనీకి చెందిన పల్లికొండ చిన్న నర్సయ్య ఇంట్లో ఉదయం దేవుడి ఫొటోల వద్ద దీపం వెలిగించారు. అనంతరం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. దీపంతో పెంకుటిల్లు కట్టెలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్‌తో మంటలు అదుపు చేశారు. అప్పటికే మంటలు వ్యాపించి ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

కారు దగ్ధం

సిరికొండ: మండలంలోని చిన్నవాల్గోట్‌ గ్రామంలో కారు దగ్ధమైంది. గ్రామానికి చెందిన చెరుకుపల్లి ఆదర్శ్‌రెడ్డి తన కారును తన ఇంటి ఆవరణలో నిలిపి ఉంచాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు విద్యుత్‌ ప్రసారంలో అంతరాయం ఏర్పడినపుడు కరెంట్‌ మీటర్‌ వద్ద మంటలు చెలరేగి కారుపై పడ్డాయని బాధితుడు తెలిపారు. కారుకు అంటుకున్న మంటలు ఇంటి తలుపులు, కిటికీలకు వ్యాపించాయి. స్థానికులు మంటలను ఆర్పి వేశారు.

డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ఇద్దరికి జైలు

ఖలీల్‌వాడి: డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో జడ్జి ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ సోమవారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 27 మందికి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచామన్నారు. అందులో వల్లపు శ్రీనివాస్‌కు ఒకరోజు, నాగులపల్లి శంకర్‌కు రెండు రోజుల జైలు శిక్షను జిల్లా సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నూర్జన్‌ విధించారని పేర్కొన్నారు. 25 మందికి జరిమానా విధించినట్లు చెప్పారు.

రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరికి..

నిజామాబాద్‌ రూరల్‌: డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు నిజామాబాద్‌ రూరల్‌ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ ఆరీఫ్‌ తెలిపారు. ఈ నెల 28న తనిఖీలు నిర్వహించగా ఆర్మూర్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికాడన్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా రెండు రోజుల జైలు శిక్ష వేసినట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో రికార్డు అసిస్టెంట్‌ మృతి

మాచారెడ్డి: మాచారెడ్డి తహశీల్‌ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాయినీ నవీన్‌(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన నవీన్‌ కొంతకాలంగా రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి కామారెడ్డి వైపు నుంచి మాచారెడ్డి వస్తుండగా పాల్వంచ మండలం ఆరేపల్లి స్టేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీకొని గాయపడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మూడు ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం

ఎడపల్లి(బోధన్‌): మండలంలోని ఠాణాకలాన్‌, అంబం గ్రామ శివారులోని మూడు ట్రాన్స్‌ఫార్మర్లను దొంగలు ధ్వంసం చేసి కాపర్‌ వైర్‌ చోరీ చేశారు. దాని విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. సంబంధిత రైతులు ఎడపల్లి ఎస్సై వంశీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సంవత్సరంలో మండలంలో సుమారు 40 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ అయ్యాయి. వరినాట్ల సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లు ఎత్తుకెళ్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

యువకుడిపై అత్యాచారం కేసు

ఖలీల్‌వాడి: నిర్మల్‌ జిల్లాకు చెందిన వాగేవార్‌ గౌతమ్‌(27)పై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం తెలిపారు. వివరాలు.. ఈ నెల 17న భర్తతో గొడవపడి నిర్మల్‌కు వచ్చిన ఓ మహిళను సాయం చేస్తానని నమ్మించి గౌతమ్‌ నిజామాబాద్‌కు తీసుకొచ్చాడు. ఓ లాడ్జిలో ఆమెకు ఇష్టం లేకుండా శారీరకంగా వాడుకొని, నిర్మల్‌లో వదిలేశాడు. సృహ తప్పి పడి ఉన్న ఆమెను గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిర్మల్‌ పోలీసులు కేసు నమోదు చేసి నిజామాబాద్‌ ఒకటో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు పంపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాల్కొండలో అగ్ని ప్రమాదం1
1/1

బాల్కొండలో అగ్ని ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement