ఇంటర్ విద్యార్థులకు మెడిటేషన్
● పరీక్షల సమయంలో ఒత్తిడికి
గురికాకుండా ఉండేందుకు..
● ప్రతి జూనియర్ కళాశాలలో
యోగా ట్రైనర్‌తో శిక్షణ
● ఇంటర్ బోర్డు నిర్ణయంతో జిల్లాలో అమలవుతున్న యోగా తరగతులు
మోర్తాడ్: ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మెడిటేషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో యోగా ట్రైనర్లతో విద్యార్థులకు మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒక్కో కళాశాలలో మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు హైదరాబాద్ నుంచి యోగా శిక్షకులు వచ్చి కళాశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
గతంలో ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం ఫెయిల్ అయినవారిలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్ధేశంతో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు ఇంటర్ విద్యాధికారులు సరికొత్త నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.
విద్యార్థుల భవిష్యత్తు కోసమే..
విద్యార్థుల ప్రయోజనాలను, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఇంటర్ బోర్డు మెడిటేషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ శిక్షణ తరగతులపై జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నాం.
– రవికుమార్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment