ఇందూరుకు ఆధ్యాత్మిక శోభ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముక్కోటి ఏకదాశి సందర్భంగా నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో అన్ని వైష్ణవాలయాలు ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబవుతున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఇందూరు నగరంలో ఉత్తర తిరుపతి, సుభాష్‌నగర్ రామాలయం, జెండా బాలాజీ అలయం, రఘునాథ ఆలయం తదితర అన్ని ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. అయితే మైసూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిజామాబాద్ గంగాస్థాన్‌లోని ఉత్తర తిరుపతి క్షేత్రం మరింత శోభాయమానంగా ముస్తాబవుతోంది. కోట్లాది మంది భక్తులు దత్తస్వరూపంగా కొలుచుకునే మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ (అప్పాజీ) ఈ నెల 09, 10 తేదీల్లో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 2004 నుంచి ఈ స్థలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అదే ఏడాది ఉత్తర తిరుపతి ఆలయానికి సంకల్పం చేశారు. 2007లో ఇక్కడ గణపతి సచ్చిదానంద గురునిలయం నిర్మించారు. తరువాత 2015లో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి 15న స్వామీజీ చేసిన కుంభాభిషేకం తరువాత నుంచి ఉత్తర తిరుపతి ఆలయం భక్తులకు దర్శనమిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సచ్చిదానంద దత్తపీఠాలు వందల సంఖ్యలో ఉన్నప్పటికీ అప్పాజీ ఇందూరుకు హాజరయ్యే విషయంలో అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తుండడం విశేషం. దీంతో ఎక్కడా లేనివిధంగా ఈ ఆలయంలో స్వామీజీ అత్యంత విలువైన మరకత శ్రీచక్రం, వినాయక, హనుమాన్ విగ్రహాలు ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ వేంకటేశ్వరస్వామి, మహాలక్ష్మిదేవి మాత విగ్రహాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. విశేషమేమిటంటే శ్రీచక్రం, వినాయక, హనుమాన్ విగ్రహాలను మైసూరు దత్తపీఠం నుంచే నేరుగా స్వామీజీ పంపడం గమనార్హం.
ఈ నెల 9, 10 తేదీల్లో నగరంలో
ఉండనున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ
గంగాస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో
ఉత్తరద్వార దర్శనం ఉత్సవాల్లో
పాల్గొననున్న అప్పాజీ
గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఈ నెల 9న సాయంత్రం 6గంటలకు స్వాగత సభ నిర్వహించనున్నారు. తరువాత 7గంటలకు స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. 10న ఉదయం 10 గంటలకు స్వామీజీ ది వ్యదర్శనం, పాదుకాస్పర్శ, శ్రీచక్ర పూజ, సా యంత్రం 5గంటలకు శ్రీనివాస కల్యాణం, సంకీర్తన, అనుగ్రహ భాషణం చేయనున్నారు. తరువాత అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 10న ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేశారు.
ఇందూరుపై అమితమైన ప్రేమ చూపిస్తారు
అప్పాజీ ఆలయం నిర్మించక ముందు నుంచి ఇందూరు విషయంలో అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. మైసూరు పీఠం నుంచి మరకత విగ్రహాలు పంపారు. జిల్లాలో స్వామీజీకి భారీ సంఖ్యలో భక్తులు ఉన్నారు. ప్రతినెలా మైసూరు దత్తపీఠానికి వెళ్లివచ్చేవారు చాలామంది ఉన్నారు. ఆయన గురించి ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా సమయం తెలియకుండా గడిచిపోతుంది. ఆయన ఆశీస్సులుంటే చాలు అన్నీ వాటంతటవే జరుగుతాయి.
– సంపత్, ఉత్తర తిరుపతి ఆలయ ఫౌండర్ ట్రస్టీ
Comments
Please login to add a commentAdd a comment