ఆదర్శనీయం ఈ యోగారత్నం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నేర్చుకోవాలనే తపన, సేవ చేయాలనే సంకల్పం, అందుకు తగిన కృషి, పట్టుదల, జిజ్ఞాస ఉంటే చాలు చిరకాలం గుర్తుండిపోయేలా సమాజానికి చాలా చేయొచ్చు. జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. ఇందూరు నగరానికి చెందిన ఎక్కొండ ప్రభాకర్ గత 41 ఏళ్లుగా ఈ దిశగా ముందుకెళుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేల మందికి యోగా నేర్పుతూ, వందల మంది యోగా మాస్టర్లను తయారు చేస్తూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ప్రభాకర్ సేవలకు గాను తన గురువు వెంకటేశం ద్వారా ‘యోగా రత్న’ అవార్డు అందుకున్నారు. ఇక్కడ మరింత ప్రత్యేకత ఏమిటంటే ప్రభాకర్ చదువుకుంది 5వ తరగతి మాత్రమే. అయినప్పటికీ తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం భాషలు మాట్లాడుతున్నారు. తెలుగులో తల్లిదండ్రులకు సేవ ఎలా చేయాలి, మనిషి జీవితం మీద, భక్తి గురించి 300 పైగా పాటలతో పుస్తకం రాశారు.
పోలీసుల విధులకు అనుగుణంగా యోగా ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని అప్పటి జిల్లా ఎస్పీ మధుసూదన్‌రెడ్డి ఆవిష్కరించారు.
● 1980లో గోపాల్‌సేట్ వద్ద యోగా గురించి తెలు సుకున్న ప్రభాకర్ గురువు వెంకటేశం వద్ద నేర్చు కున్నారు. 1984 నుంచి ‘వాడవాడకు యోగా’ నినాదంతో ఉచితంగా యోగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. జిల్లా పోలీసు విభాగంలో నిరంతరం యోగా శిక్షణ ఇస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారుల వరకు ఆయన వద్ద యోగా నేర్చుకున్నారు. అన్నివర్గాల వారికి యోగా నేర్పుతూ వందల మంది యోగా మాస్టర్లను తయారు చేశారు. మసీదుల్లో సైతం యోగా తరగతులు నిర్వహించారు. ఈయనకు వందల మంది మైనారిటీ శిష్యులు ఉన్నారు. వీరంతా ప్రభాకర్‌ను ప్రతి గురుపౌర్ణమికి సత్కరిస్తున్నారు. ముస్లిం మైనారిటీ యోగా కేంద్రం సైతం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటై, ఆయన శిశ్యుడు మాస్టర్ షహీ ద్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నడుస్తోంది. ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇందూరు, నిర్మల్ జిల్లాల్లో 16 చోట్ల పతంజలి యోగా కేంద్రాలు నిర్మాణం అయ్యాయి. జిల్లా యోగా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఈయన ఆధ్వర్యంలో అర్సపల్లిలో వివేకానంద యోగా కేంద్రం 2000 సంవత్సరంలో మొదలైంది. ఈ కేంద్రానికి ప్రస్తుతం రజతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రభాకర్
ఇందూరు, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటి వరకు
16 చోట్ల యోగా కేంద్రాల నిర్మాణం
యోగా శిక్షణతో వేలాదిమందిని
మాస్టార్లుగా తీర్చిదిద్దిన గురువు
ఆయుర్వేదం నేర్చుకుని ప్రాణాంతక
వ్యాధులకూ మందులు
ఫలితం ఆశించని సేవలు
తల్లిదండ్రులకు సేవ, మానవ
జీవన విధానంపై 300 పైగా
పాటలు రాసిన రచయిత
మసీదుల్లోనూ యోగా శిక్షణ
తరగతులు..
Comments
Please login to add a commentAdd a comment