ప్రత్యేక దృష్టి సారించాం
నగరంలోని వివిధ ప్రాంతాల్లో సైడ్ డ్రైన్ల నుంచి అవుట్‌ఫాల్ డ్రైన్ల వరకు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. చాలాచోట్ల ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగిస్తున్నా నీరు నిల్వ ఉంటోంది. గత కారణాలను గుర్తించి అవుట్‌ఫాల్ డ్రైన్లలో కలిసే సైడ్ కాల్వలు, అవుట్‌ఫాల్ డ్రైన్లలో గడ్డర్లు ఏర్పాటు చేసి వ్యర్థపదార్థాలు ప్రారంభ దశ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.
– ఎం.ప్రభాకర్, సీఈ, వీఎంసీ
పటమట(విజయవాడతూర్పు): నగరంలో డ్రెయిన్ల సమస్యలు పరిష్కరించడానికి నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. డ్రెయిన్ల తో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతివారం స్పందనలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధప్రాతిపదికన డ్రెయిన్ల లో సిల్టు తొలగింపు, వ్యర్థాల నిరోధానికి వీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. దీనిలో భాగంగా నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్న 39 డ్రెయిన్లలో గ్యాంగ్‌వర్కర్లను ఏర్పాటు చేసి వాటిని తొలగించడం, తరలించడం చేయనున్నారు. డ్రెయిన్లలో పూడికతీత పనులకు రూ. 2.45 కోట్లను కార్పొరేషన్ సాధారణ బడ్జెట్ నుంచి నిధులు వెచ్చించనుంది. సర్కిల్–1 పరిధిలో 12 పనులకు రూ. 65.38 లక్షలు, సర్కిల్–2 పరిధిలో 10 పనులకు 1.01 కోట్లు, సర్కిల్–3 పరిధిలో 17 పనులకు 78.29 కోట్లు నిధులను వినియోగించనున్నారు. దీన్ని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు.
ప్రధాన అడ్డంకులు తొలగించడానికి
డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థపదార్థాలు మురుగునీటి పారుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. గృహ, వ్యాపారాల నుంచి ఘన వ్యర్థాలు కూడా డ్రెయిన్లలో పేరుకుపోయాయి. దీంతో వీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అవుట్‌ఫాల్ డ్రెయిన్లలో కలిసే సైడ్ కాల్వల పాయింట్ల వద్ద గడ్డర్లు అమర్చి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది వాటిని తొలగించే ఏర్పాట్లు చేశారు. ఇలా చేస్తే రెసిడెన్షియల్ ఏరియాల నుంచి వచ్చే వ్యర్థాలను గుర్తించి తొలగిస్తే.. ప్రధాన డ్రెయిన్లలో మురుగు పారుదలకు అవరోధాలు ఏర్పడవని అధికారులు తెలిపారు. ప్రధాన డ్రెయిన్లలో పేరుకుపోయిన వాటిని తొలగించడానికి కాల్వల్లో కన్వేయర్ బెల్ట్ ద్వారా వ్యర్థాలను వేరుచేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు వించిపేట, కొత్తపేట ఏరియాల్లో ఏర్పాటు చేసినవే ఉదాహరణలని అధికారులు తెలిపారు.
సైడ్ కాల్వలపై వీఎంసీ వేసవి ప్రణాళిక మూడు సర్కిళ్ల పరిధిలో 39 పనులకు అంచనాలు రూ.2.45 కోట్లతో సిల్ట్ తొలగింపు, తరలింపు నిరంతర పర్యవేక్షణ మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్లపై ప్రధాన దృష్టి
సర్కిల్–2 పరిధిలో ..
తోటవారి వీధి, కృష్ణాహోటల్, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి రోడ్డు, డాబా కొట్ల సెంటర్ వరకు ఉన్న 4.15 కి.మీ దూరం
ఇన్నర్ రింగ్ రోడ్డు తూర్పు, పశ్చిమ వైపు ఉన్న డ్రెయిన్ 8 కి.మీ, సింగ్‌నగర్ ఆర్‌ఓబీ నుంచి పైపుల రోడ్డు వరకు 3.20 కి.మీ డ్రెయిన్లలో సిల్టు తొలగిస్తున్నారు.
ఎన్‌ఎస్‌సీ బోస్‌నగర్ మెయిన్‌రోడ్డు 2.50 కి.మి. దూరం
సర్కిల్–1 పరిధిలో..
కంసాలిపేట నుంచి జీరో బల్బ్ ఏరియా వరకు, మహంకాళమ్మ గుడి రోడ్డు ప్రారంభం నుంచి జీరో బల్బ్ ఏరియా వరకు 2.77 కి.మి. దూరం ఉన్న డ్రెయిన్
ఊర్మిళానగర్ మెయిన్‌రోడ్డు నుంచి బైపాస్ కల్వర్టు. క్రాంబ్వే రోడ్డుకు రెండు వైపులా, ఆర్టీసీ వర్క్‌షాప్ వరకు ఉన్న 3.13 కి.మి వరకు
సితార జంక్షన్ నుంచి లేబర్‌కాలనీ వరకు 5.95 కి.మి. డ్రెయినలో సిల్టు తొలగించనున్నారు.
సర్కిల్–3 పరిధిలో
పుల్లేటి కాల్వ 5.10 కి.మీ.
రమేష్ ఆస్పత్రి నుంచి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వెంబడి ఇరువైపులా 5.10 కి.మీ దూరం
పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆర్‌ఆర్ దర్బార్ వరకు 2.40 కిమీ దూరం వరకు..కాల్వల సమస్యలు తీరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment