తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వ కృషి ఒక్కటే సరిపోదని, పౌరసమాజం ముందుకు వచ్చినప్పుడే అది సాధ్యమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరిగిన వివిధ అంశాలపై రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. మాతృభాషలో బోధన జరిగినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన జరగాలని జాతీయ విద్యా విధానం చెబుతోందన్నారు. తెలుగు భాషా పరిరక్షణకు సంబంధించి మహాసభ చేసిన తీర్మానాలతో పాటుగా ఆచరణాత్మక కార్యాచరణను తీసుకొని ముందుకు వస్తే ప్రభుత్వం పక్షాన దానిని సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానన్నారు.
అందరి భాగస్వామ్యంతోనే..
సమాజంలో అందరి భాగస్వామ్యంతోనే తెలుగు భాషా పరిరక్షణ సాధ్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆరో తెలుగు రచయితల మహాసభల్లో భాగంగా రాజకీయ ప్రతినిధుల సభ ఆదివారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన సత్యకుమార్ హాజరయ్యారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రసంగించారు.
రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఆంగ్ల మాధ్యమ జీఓను రద్దు చేయాలి
పాఠశాలలోని ఆంగ్ల మాధ్యమ జీఓ 85ను రద్దు చేయటమే కాకుండా సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌ను వెనుకకు తీసుకోవాలని తెలుగు రచయితల ఆరో మహాసభ తీర్మానం చేసింది. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మహాసభల గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జి.వి.పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment