అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించే విధంగా పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పాలని దళిత, గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం దళిత, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి బందరు రోడ్డలోని సామాజిక న్యాయ మహా శిల్పం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహాశిల్పం ఎదుట నిరసన తెలిపారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దళిత, గిరిజన ప్రజా, కార్మిక, మహిళా సంఘాలు, మేధావులు పాల్గొని అమిత్‌షా వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలోనే రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు అంబేడ్కర్‌నే కాక యావత్ దేశ ప్రజలందరినీ అవమానించడమేనని అన్నారు. అంబేడ్కర్ పేరు పలకడమే నేరమన్నట్టుగా అసహనం ప్రదర్శించి, బీజేపీ అసలు బుద్ధిని చూపించుకుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా ఆయన క్షమాపణ చెప్పకుండా విపక్షాలపై విరుచుకుపడడం సిగ్గు చేటన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు జి.నటరాజ్, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.క్రాంతి కుమార్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ, ఆమ్‌ఆద్మీ రాష్ట్ర కన్వీనర్ నేతి మహేష్, డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, అంబేడ్కర్ మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రామారావు తదితరులు పాల్గొన్నారు.
దళిత, గిరిజన, ప్రజా సంఘాల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment