హద్దు మీరితే.. చర్యలు తప్పవు
విజయవాడస్పోర్ట్స్: వేడుకలు ఆహ్లాద కరంగా, ఆమోద యోగ్యంగా, హాని రహితంగా ఉండాలని.. ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా ఉండకూడదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 31వ తేదీ అర్ధరాత్రి హద్దు మీరి ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజా శాంతిభద్రతల రక్షణ కోసం ఆ రోజు జిల్లాలో ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేవని, విజయవాడ నగరంలోని ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్డు, బెంజిసర్కిల్ ఫ్‌లై ఓవర్, కనకదుర్గా ఫ్లైఓవర్‌పై అధిక సంఖ్యలో వాహనాలకు అనుమతి లేదని, వెస్ట్ బైపాస్ రోడ్డులోకి వాహనాలను అనుమతించమన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, గుంపులుగా రోడ్డుపైకి చేరినా, కేకలు వేస్తూ రోడ్లపై తిరిగినా, బైక్‌లకు సైలెన్సర్ తీసివేసి శబ్దాలతో హోరెత్తించినా, బాణా సంచా పేల్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హెల్మెట్ లేకుండా ప్రకాశం బ్యారేజ్‌పైకి ప్రవేశం లేదు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రకాశం బ్యారేజీపై ఈ నెల 30వ తేదీ నుంచి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనచోదకులను అనుమతించబోమని ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. ఇటీవల హైకోర్ట్ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇక నుంచి ద్విచక్రవాహనాల్లో వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా 30వ తేదీ నుంచి ప్రకాశం బ్యారేజ్ పైన ప్రవేశం ఉండదని తెలిపారు. కొంతకాలంగా రహదారులపై జరిగే ప్రమాదాలలో అత్యధికంగా ద్విచక్రవాహనాలే ప్రమాదానికి గురవుతున్నాయని, హెల్మెట్ ధరించకపోవడంతో తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment