కారు టైర్ల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
కంకిపాడు: కారు టైర్ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 కార్లకు సంబంధించి 44 టైర్లు, వీల్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.3.52 లక్షలుగా పోలీసులు భావిస్తున్నారు. స్థానిక పీఎస్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఆయన మాట్లాడుతూ.. ఈడుపుగల్లు గ్రామ పరిధిలో ఉన్న సంతోష్ ట్రూవాల్యూ షోరూమ్‌లో గతేడాది డిసెంబరు 19వ తేదీ రాత్రి చోరీ జరిగింది. 11 కార్లకు చెందిన 44 టైర్లు, వీల్ డిస్క్‌లతో సహా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఘటనపై షోరూమ్ యజమాని చుక్కపల్లి కృష్ణప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేశారు. షోరూమ్, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ప్రాథమిక వివరాలను సేకరించారు. సీఐ జె.మురళీకృష్ణ ఆధ్వర్యాన ఎస్‌ఐ డి.సందీప్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ సాగించింది. ఈ నెల 23న కంకిపాడు బైపాస్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కారును అతివేగంగా నడుపుతూ పోలీసు సిబ్బందిని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వారు అప్రమత్తమై కారును అడ్డగించి తనిఖీ చేయగా, కారు వెనుక భాగంలో కొన్ని టైర్లు, ఇద్దరు యువకులు ఉండటాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా సంతోష్ ట్రూ వాల్యూ షోరూమ్‌లో కారు టైర్ల చోరీ కేసులో నిందితులుగా గుర్తించారు. నిందితులు కంకిపాడు మండలం చలివేంద్రపాలెం గ్రామానికి చెందిన వల్లూరి బాలాజీ, పామర్రు మండలం వీరాంజనేయపురానికి చెందిన చిల్లిముంత నరేంద్రకుమార్‌గా తేల్చారు. బాలాజీ గతంలో కార్ షోరూమ్‌లో పని చేశాడు. నరేంద్రకుమార్ సెల్ఫ్‌డ్రైవ్ చేస్తూ కారు డ్రైవర్‌గా పని చేశాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత సులభంగా డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో చోరీ మార్గాన్ని ఎంచుకున్నారు. తొలి చోరీతోనే నిందితులు ఇద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న టైర్లు, వీల్ డిస్క్‌ల విలువ మార్కెట్‌లో రూ.3.52 లక్షలు ఉంటుంది. పరారీకి యత్నించిన కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ముఖ్యభూమిక పోషించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.సందీప్, హెచ్‌సీ కె.చంద్రబాబు, పీసీలు బాలు, బాజీబాబు, హెచ్‌జీలు పిళ్లై మురార్జీ, రాంబాబుకు రివార్డులను అందించారు.
11 కార్లకు సంబంధించి 44 టైర్లు, వీల్ డిస్క్‌లు స్వాధీనం
స్వాధీన సొత్తు విలువ రూ.3.52 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment