రంగుమారిన ధాన్యాన్ని కొంటాం
● రైతులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి
● గజపతి జిల్లాలో ఆకస్మిక పర్యటన
● ఉప్పలాడ, లింగుపురం రోడ్డు వద్ద బైఠాయించిన రైతులు
పర్లాకిమిడి: అకాల వర్షాలకు రంగుమారిన ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభయమిచ్చారు. ఆదివారం గజపతి జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ మంత్రి సురేష్ పూజారితో కలిసి సీఎం ఆకస్మికంగా పర్యటించారు. పర్లాకిమిడి నుంచి ఉప్పలాడ, లింగుపురం మీదుగా గురండి గ్రామం చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడారు. పొలాల్లో పాడైన ధాన్యంపై ఆరా తీశారు. ఫసల్ భీమా యోజన పథకంలో ఎందుకు చేరడం లేదని రైతులను ప్రశ్నించారు. ప్రీమియం కట్టి ఉంటే పాడైన పంటకు రెట్టింపు పరిహారం అందేదని చెప్పారు. అయినా రాష్ట్ర ప్రభు త్వం తరఫున పరిహారం అందించేందుకు క్యాబినెట్‌లో చర్చిస్తామని తెలిపారు. రంగు మారిన ధాన్యాన్ని తక్కువ ధరకై నా కొనుగోలు చేసే విష యమై ఆలోచిస్తామన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గురండి – లింగుపురం రోడ్డులో రైతులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
దీంతో సీఎం కారు దిగగా రైతులు వినతి పత్రాన్ని అందించారు. గుసాని సమితిలో ఎక్కువగా పంటనష్టం జరిగిందని రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. పాటికోట– చందనకోలా– కేతాడ–బిత్తిసింగి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బల్ల ధనుంజయ విన్నవించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్లాకిమిడిలో గజపతి స్టేడియానికి చేరుకుని హెలికాఫ్టర్‌లో గంజాం జిల్లా ఛత్రపూర్‌కు పయనమయ్యారు. పర్యటనలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అధ్యక్షుడు కోడూరు నారాయణరావు, కలెక్టర్ బిజయకుమార్ దాస్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, గుసాని సమితి బీడీఓ గౌరచంద్ర పట్నాయక్, గుసాని సమి తి చైర్మన్ ఎన్.వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment