వేసవికి ప్రత్యేక ఏర్పాట్లు
శనివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2025
పూరీ జగన్నాథ ఆలయంలో..
భువనేశ్వర్: నిత్యం యాత్రికుల తాకిడితో కిటకిటలాడే పూరీ శ్రీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో భ క్తులు, యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది వేసవి కాలం తీవ్రత దృష్ట్యా ప్రత్యేక సౌకర్యాల కోసం సన్నాహాలు చేస్తున్నారు. వేసవి తాపంతో వడదెబ్బ సంబంధిత విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్త వహిస్తున్నారు.
ఆలయ సముదాయంలో సురక్షిత తాగునీరు
శ్రీ మందిరం సముదాయంలో దర్శనం కోసం విచ్చేసే యాత్రికుల కోసం సురక్షిత (ఆర్‌ఓ) తాగు నీరు సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తుల సౌలభ్యం కోసం శ్రీ మందిరం ప్రాంగణంలో 50 తాగునీటి స్టాండ్ పోస్టులను ఏర్పాటు చేయాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్‌జేటీఏ) యోచిస్తోంది.
వేడిమి నివారణ సన్నాహాలు
మండుటెండ సమయంలో శ్రీ మందిరం ప్రాంగణంలో తిరుగాడే వారి పాదాలు ఎండ వేడిమికి గురి కాకుండా చేసేందుకు నడిచే మార్గంలో తివాచీలు, దారి పొడవునా ఎండ నుంచి ఛాయ కల్పించేందుకు ఛాయా పందిళ్లు, చన్నీటి సించనం వంటి శీతల సదుపాయాలతో ఆపత్కర అనారోగ్య పరిస్థితుల నిర్వహణ కోసం ప్రథమ చికిత్స కేంద్రాలు, పలు ప్రాంతాల నుంచి విచ్చేసే యాత్రికుల కోసం సమాచార కేంద్రాలు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పూరీ కలెక్టరు అధ్యక్షతన జరగిన శ్రీ జగన్నాథ ఆలయ పాలక వర్గం (ఎస్జేటీఏ) వేసవి సన్నాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సమావేశంలో తాగునీటి పోస్టుల ఏర్పాటుకు సంబంధించిన వివరణాత్మక బ్లూప్రింట్, ప్రణాళికాబద్ధమైన లేఅవుట్‌ను ఖరారు చేశారు. భక్తులు హాయిగా నడిచేందుకు కార్పెట్‌లు ఏర్పాటు చేయడం, వేడి నుంచి రక్షించేందుకు ఫ్యాన్‌లతో కూడిన ఛాయా పందిళ్ల నిర్మాణాలు, చన్నీటి సించన వ్యవస్థ, ప్రథమ చికిత్స కేంద్రాలు వంటి మరిన్ని సౌకర్యాల కల్పనపై చర్చించారు.
సింహ ద్వారం ఆవరణలో సమాచారం
శ్రీ మందిరం సింహ ద్వారం ఆవరణలో భక్తులు, యాత్రికులకు ఆలయ సంబంధిత సమాచారం అందజేసేందుకు సమాచార కేంద్రాలు, సహాయ డెస్క్‌ల ఏర్పాటు ప్రతిపాదన ఆమోదించారు.
న్యూస్‌రీల్
వేసవి తాపం ఉపశమనం
చలి క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో వేసవి కాలం దృష్ట్యా తీవ్రమైన వేడిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు తగినంత తాగు నీరు, శీతలీకరణ సౌకర్యాలు ఉండేలా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వంయి తెలిపారు. ఆయన అధ్యక్షతన జరిగిన వేసవి సన్నాహక సమావేశంలో ఆలయ అభివృద్ధి కార్యనిర్వహణాధికారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్, అగ్నిమాపక సేవల శాఖ అధికారులు, ప్రభుత్వ నిర్మాణం, విద్యుత్, రవాణా శాఖల ప్రతినిధులు వంటి కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథ ఆలయ రత్న భాండాగారం మరమ్మతు పనులకు సంబంధించిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. భారత పురావస్తు శాఖ ఏఎస్‌ఐ ముందస్తు ప్రతిపాదన ప్రకారం భాండాగారం నిర్వహణ, మర్మతు పనులకు నిర్ధారిత వెసులుబాటు కల్పించక పోవడంతో ఈ పనుల్లో కొంత మేరకు జాప్యం చోటు చేసుకుంది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టి పనులు వేగిరపరచనున్నట్లు కలెక్టరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment