అంజన్న హుండీ ఆదాయం రూ.కోటి
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయానికి 75రోజులకుగాను హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం అధికారులు లెక్కించారు. 12 హుండీలను లెక్కించగా రూ.1,04,36,365తోపాటు 60 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల మిశ్రమ వెండి, 78విదేశీ కరెన్సీ సమకూరాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో రామకృష్ణారావు, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని
దంపతులకు తీవ్ర గాయాలు
మంథని: మంథని–గోదావరిఖని ప్రధాన రహదారి విలోచవరం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మంథనికి చెందిన గీట్ల అగజ గుంజపడుగు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. గురువారం ఆమె విధులు ముగించుకొని, భర్త గంగారెడ్డితో కలిసి బైక్‌పై మంథనికి వస్తోంది. మార్గమధ్యలో విలోచవరం నుంచి నాగారం వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగజ, గంగారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబసభ్యులు తెలిపారు. మంథనిలో ప్రథమ చికిత్స చేయించి, కరీంనగర్ తరలించారు.
రేచపల్లిలో గంజాయి సాగు
సారంగాపూర్: మండలంలోని రేచపల్లికి చెందిన ఓ రైతు తన పొలంలో గంజాయి సాగుచేస్తుండడంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం గ్రామానికి చెందిన పోతుగంటి తిరుపతి తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తనిఖీలు చేయగా తొమ్మిది చెట్లు కనిపించాయి. అలాగే 300 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చెట్ల విలువ రూ.90 వేలు, ఎండిన గంజాయి విలువ రూ.7,500 ఉంటుందని, నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment